విశాఖ‌లో నిర్వ‌హించిన లాంగ్ మార్చ్‌తో..జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... ఫుల్ యాక్టివ్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. . భవన నిర్మాణ కార్మికుల కోసం తలపెట్టిన లాంగ్ మార్చ్ విజ‌య‌వంతం అయిన నేప‌థ్యంలో...ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా విశాఖ‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మార్చ్‌కు మద్దతు తెలిపిన పార్టీలకు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన జనసైనికులకు, ఆడపడుచులకు ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌భుత్వం తీరును త‌ప్పుప‌ట్టారు. 


ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి అని పవ‌న్ విశ్లేషించారు. ``ఇసుక విధానంలో లోపాలు ఉన్నాయని తెలిసినా దాన్ని సరిదిద్దడం లేదంటే అందులో ఏదో లబ్ది కోసం వెతుకుతున్నారు. నిజంగా సరిచేయాలి అంటే 15 రోజుల  సమయం సరిపోదా..?. ఇసుక కొరత సమస్య పరిష్కారానికి రెండు వారాలు గడువు ఇచ్చాం. గడువులోగా సమస్యను పరిష్కరించకపోతే జనసేన శ్రేణులు భవన నిర్మాణ కార్మికులకు అండగా టెంట్లు వేసుకొని కూర్చుంటారు. ఈ రెండు వారాలూ సమస్యను గుర్తు చేసేందుకు నిరసనలు కొనసాగిస్తాం. అయితే అది రేపటి నుంచి మొదలు పెట్టాలా?, ఎల్లుండా అనేది స్పష్టం చేస్తాం.`` అని వెల్ల‌డించారు. 


ఈ సంద‌ర్భంగా సినిమాల్లోకి త‌న‌ రీ ఎంట్రీపై ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చారు. ``సినిమాల్లో నటిస్తానో లేదో ఇంకా స్పష్టత లేదు. అయితే ఖచ్చితంగా ప్రొడ్యూస్ మాత్రం చేస్తాను. నాకు తెలిసింది సినిమానే. రాజకీయాల కోసం ఎవరు వ్యాపారాలు మానుకున్నారు?. జగన్ రెడ్డి గారికి జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ వారు ఆపేసుకున్నారా..?. లేదా అవంతి కాలేజీలు లాక్కుని నేను ఏమైనా పాలిటిక్స్ చేయాలా?`` అని వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నిస్తే.. మంత్రులు, ఎమ్మెల్యేలు త‌న‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ప‌వ‌న్ మండిప‌డ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: