ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు జరిగాయి. అనూహ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు జరిగింది. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం అధిపతిగా ప్రవీణ్ ప్రకాష్ నియమితులయిన నాటి నుంచి పలు పరిణామాలు జరుగుతున్నాయి.తొలుత సీఎస్‌కి సంబంధం లేకుండా వివిధ శాఖలకు చెందిన ఫైళ్లు తనకు పంపించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపింది.


క్యాబినెట్ కార్యదర్శిగా వ్యవహరించే సీఎస్ స్థానంలో సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి హోదాలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ నిర్ణయం తీసుకోవడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది.దాంతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా తీవ్రంగా స్పందించారు. ఏకంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు.ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తికి షోకాజ్ నోటీసు జారీ చేయడం దేశంలోనే అరుదైన ఘటనగా చెబుతున్నారు.ప్రవీణ్ ప్రకాష్‌కి నోటీసు జారీ అయిన కొన్ని గంటల్లోనే సీఎస్ సీటు మారుస్తూ నిర్ణయం వెలువడింది


కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిని రాష్ట్ర ప్రభుత్వమే బదిలీ చేసిన సంఘటన గత 10-15 ఏళ్లలో చోటు చేసుకోలేదు.రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్ అయిన కొద్దిమంది ఐఏఎస్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమిస్తుంటారు. కాబట్టి, ఈ హోదాలో వీరి పదవీకాలం చాలా తక్కువ ఉంటుంది.తన ప్రభుత్వం హయాంలో పనిచేసే ఐఏఎస్‌లను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అయితే, ఆ బదిలీ ఉత్తర్వులు జారీ చేసేది మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే.


అలాంటిది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎమ్మార్ సంస్థకు కేటాయించిన భూముల వివాదం అప్పట్లో ఎల్ వి సుబ్రహ్మణ్యం మెడకు చుట్టుకుంది. ఆయన సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: