ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో అనూహ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌కి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిని రాష్ట్ర ప్రభుత్వమే బదిలీ చేసిన సంఘటన గత 10-15 ఏళ్లలో చోటు చేసుకోలేదు.  ప్రభుత్వం హయాంలో పనిచేసే ఐఏఎస్‌లను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అయితే, ఆ బదిలీ ఉత్తర్వులు జారీ చేసేది మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే.


అలాంటిది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు శ్రేయస్కరం కాదని పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని తొలగించే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ ఈ విధానం సరికాదని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. కాగా,ఈ అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.


అయితే, ఒక సంవత్సరంలోపు పదవీకాలం ఉన్నప్పుడు ఒక అధికారిని ప్రభుత్వం బదిలీ చేస్తే.. సదరు అధికారి అదే నగరం/పట్టణంలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని, అలాంటి అవకాశం లేకపోతే రిటైర్మెంట్ పూర్తయ్యే వరకూ అదే పోస్టులో కొనసాగించాలంటూ గతంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. కాబట్టి, ఎల్వీ సుబ్రహ్మణ్యం కనుక కోర్టును లేదా క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)ను ఆశ్రయిస్తే ఈ బదిలీ చెల్లుబాటు కాకపోవచ్చునని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ‘‘సీఎస్‌ను తొలగించిన విధానం సరిగా లేదు.

ఎలాంటి బాధ్యత లేకుండా.. అంతులేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. దీనిని నియంత్రించలేని ముఖ్యమంత్రుల పతనానిని సీఎంఓనే కారణమవుతోంది’’ అని ఒక ఫేస్‌బుక్ పోస్టులో కృష్ణారావు తెలిపారు.‘హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు (ఎల్వీ సుబ్రహ్మణ్యంకు) ఇది బహుమానం అయితే ఇంకా దారుణం’’ అని ఆయన ఈ పోస్టులో పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైఎస్ జగన్ కోరి తెచ్చుకున్న వ్యక్తి ఎల్వీ సుబ్రహ్మణ్యం అని, అలాంటి వ్యక్తిని బదిలీ చేశారంటే అర్థం అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: