తెలంగాణ మొత్తం నిరసనలతో, బంద్ లతో హోరెత్తి పోతుంది. కార్మికుల సమ్మెతో దిమ్మ తిరుగుతున్న కెసిఆర్ కు  రెవెన్యూ ఉద్యోగుల రూపంలో మరో సెగ మొదలైంది.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా బుధవారం రోజున రాష్ట్ర బంద్ చేయాలని పిలుపునిచ్చారు రెవెన్యూ ఉద్యోగులు. మంగళవారం మధ్యాహ్నం తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి ఓ దుండగుడు నిప్పంటించి సజీవ దహనం చేసిన ఘటన అత్యంత దారుణమని అన్నారు.

ఈ ఘటనతో ఉద్యోగులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని, హైదరాబాద్-విజయవాడ హైవేపై ధర్నాచేశారు.దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వారికి సర్దిచెప్పి.. నిరసన విరమింపజేశారు. ఇధి అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి అన్నారు. ఈ దారుణ ఘటనపై నిరసనగా రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులంతా విధులను బహిష్కరించారని చెప్పారాయన.

మంగళవారం విజయారెడ్డి అంతిమ యాత్ర లో పాల్గొనడానికి హైదరాబాద్, CCLA కార్యాలయానికి  రావాలని రెవెన్యూ ఉద్యోగులకు పిలుపునిచ్చారాయన. ఆమె మృతికి సంతాపంగా మూడు రోజుల పాటు విధులను బహిష్కరించి నిరసన తెలపాలన్నారు. దోషుల వెనక ఉన్న అసలు కుట్రదారులను  గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ట్రెసా అధ్యక్షుడు. ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులుకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

త్వరలోనే తమ తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఆమె మృతికి సంతాపంగా రేపు (బుధవారం) రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చారు రెవెన్యూ ఉద్యోగులు.భూరికార్డుల ప్రక్షాళనతోనే తమపై దాడులు జరుగుతున్నాయన్నారు రెవెన్యూ ఉద్యోగులు. 
తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, అయినా సర్కారు పట్టించుకోవడం లేదని అన్నారు. ధరణి వెబ్ సైట్ లో చాలా సమస్యలున్నాయని.. అందువల్లే పనిలో చాలా ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఉన్నతాధికారులకు చెప్పినా… సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: