రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై అత్యంత హేయ‌మైన రీతిలో పెట్రోల్ దాడి చేసి చంపిన ఉదంతం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.  రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ ఈ కేసుకు సంబంధించిన సంచ‌ల‌న వివ‌రాల‌ను వెల్డించారు. నిందితుడు గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్ అని చెప్పారు పోలీస్ కమిషనర్ భగవత్. అతడికి సంబంధించిన 7 ఎకరాల భూమి వివాదంలో ఉందని, దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ విషయమై తహశీల్దార్ పై దాడి చేశాడా లేక మరేదైనా కారణంతో చేశాడా అన్నది తేలాల్సి ఉందన్నారు.


`` గౌరెల్లి గ్రామానికి చెందిన నిందితుడు సురేష్‌, అతడి సోదరుడికి బాచారంలో సర్వే నంబర్‌ 92, 96లో 7ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. ఆ భూ వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. భూవివాదం ఇష్యూలోనే సురేష్‌ ఈ రోజు తహసీల్దార్‌ ఆఫీస్‌కు వచ్చి విజయా రెడ్డిపై దాడి చేశాడు. ఆమెపై పెట్రోల్‌ పోసి లైటర్‌తో నిప్పంటించాడు.ఆ  సమయంలో సురేశ్ కూ మంటలు అంటుకున్నాయి. కాలిన గాయాలతోనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ వరకూ వచ్చాడు. దాదాపు 60 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేశ్ ను ఆస్పత్రికి తరలించాం` అని సీపీ భగవత్ తెలిపారు.ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది అని సీపీ పేర్కొన్నారు.


త‌హ‌శీల్దార్ ఆఫీసులో జ‌రిగిన ఘ‌ట‌న గురించి వివ‌రిస్తూ...`అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో హత్యాయత్నం జరిగిందని కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో మేం వెళ్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలించాం.  తహసీల్దార్‌ ఉంటున్న గదికి ఆటోమేటిక్‌ డోర్స్‌ ఉన్నాయి. దాడి జరిగినప్పుడు ఆమె బయటకి రావడానికి కొంత ఇబ్బంది కలిగింది. డోర్‌ను డ్రైవర్‌, అటెండర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత మంటలతోనే బయటకి వచ్చి వరండాలో పడిపోయి సజీవ దహనమైంది.`` అని వెల్ల‌డించారు. నిందితుడు దాడి చేయడానికి గల కారణాలు, ఎవరైనా అతని వెనకుండి ఈ దాడి చేయమని ప్రోత్సహించారనే విషయాలు దర్యాప్తులో తేలుతుందని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: