ఏపీలో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ చేపట్టిన తర్వాత ఇది ఇంకాస్త ఎక్కువైంది. లాంగ్ మార్చ్ సభలో విజయసాయిరెడ్డిపై పవన్ విరుచుకుపడ్డారు. సూట్ కేసు కంపెనీలు పెట్టుకున్న విజయసాయిరెడ్డి కూడా నన్ను విమర్శిస్తాడా.. అని పవన్ డైరెక్టుగానే ఎటాక్ చేశారు. దీనికి ఇప్పుడు వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి.


ఏపీ జనం ఒక్క వైయస్‌ఆర్‌ సీపీని తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే మిగతా పార్టీల నుంచి వలసలు వస్తున్నాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మిగతా పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని విజయసాయిరెడ్డి చెప్పారు.


చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నాడని, పవన్‌ చంద్రబాబు దత్తపుత్రుడని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో పవన్‌ చేసింది లాంగ్‌మార్చ్‌ కాదు.. రాంగ్‌ మార్చ్‌ అన్నారు. మార్చ్‌ అంటే పవన్‌ నడుస్తాడనుకున్నాం కానీ ఒక్క అడుగు కూడా వేయకుండా కారు ఎక్కి సినిమా ఫక్కీలో చేయి ఊపుకుంటూ వెళ్లాడన్నారు. ఆయన పార్టీ, విధానాలు కూడా అలాగే ఉన్నాయని విజయసాయిరెడ్డి చెప్పారు. గతంలో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వస్తే.. పవన్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు.


చంద్రబాబు డైరెక్షన్‌ పవన్‌ పనిచేస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తన జీవితంలోని కాల్‌షీట్‌ను బాబుకు ఇచ్చేశాడని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకులను కలిసినా.. ఆమెరికా వెళ్లి అధ్యక్షుడు ట్రంపుతో మాట్లాడినా పవన్‌ కల్యాణ్‌ను ఆంధ్రరాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు.


వైసీపీలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి సోదరుడు.. సన్యాసిపాత్రుడు చేరారు. ఆ సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నవరత్నాలతో రాష్ట్రాన్ని, ప్రజలను సీఎం వైయస్‌ జగన్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఆ సందర్భంగానే పవన్ పై విరుచుకుపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: