ఇసుక సమస్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో ఆదివారం లాంగ్ మార్చ్ నిర్వహించారు. పేరుకు లాంగ్ మార్చ్ అయినా పవన్ కల్యాణ్ కారుపైనే మార్చే చేశారు. ఆ తర్వాత సభలో మాట్లాడుతూ.. జగన్ సర్కారుకు రెండు వారాల డెడ్ లైన్ విధించారు.


అయితే ఈ డెడ్ లైన్ ను సీఎం జగన్ చాలా లైట్ గా తీసుకున్నారనే చెప్పాలి. అమరావతిలో ఇసుక సమస్యపై సమీక్ష నిర్వహించిన జగన్... ఇసుక అన్నది తాత్కాలిక సమస్య మాత్రమేనని, వరదలు తగ్గగానే ఇసుక సరఫరా పెరుగుతుందని అన్నారు. ఈ నెలాఖరునాటికి ఇసుక సమస్య తీరుతుందన్నారు. అంటే ఇంకా మూడు, నాలుగు వారాలు ఉందన్నమాట. అంటే పవన్ డెడ్ లైన్ ను జగన్ ఖాతరు చేయనట్టే అనుకోవాలి.


రోడ్లు, భవనాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్.. అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇసుక తాత్కాలిక సమస్య మాత్రమే. 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోంది. 265కిపైగా ఇసుక రీచ్‌ల్లో 61 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలోనే ఉన్నాయి. వరదల దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా ఉంది. లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులకు నిరంతరం వరదల వల్ల ఇసుక సమస్య ఏర్పడింది.


గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచింది. ఇసుక విక్రయాలకు నూతన పాలసీ తీసుకువచ్చాం. అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నాం.ప్రజలు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించాం. కిలోమీటర్‌కు రూ.4.90కు ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నాం. వరద తగ్గగానే ఇసుక సరఫరా పెరుగుతుంది. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, అధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: