తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేటితో 31 రోజులు అవుతుంది. అయినా సమ్మె విషయంలో అటు ప్రభుత్వం గాని, ఇటు కార్మికులు గాని పట్టువీడకుండా ఉన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంది కాబోలు ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇకపోతే సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగియనుంది.


విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్లయిందని, దాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? విని యోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే కాకుండా గడువులోగా చేరని కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేర్చుకోవద్దని, కార్మికులు గడువులోగా చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.


ఈ విషయాన్ని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు, వారి కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదు. ఉద్యోగాలు కాపాడుకోవడం కార్మికుల చేతుల్లోనే ఉంది. అని తీవ్రంగా హెచ్చరించింది.


ఇకపోతే  మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదని. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని. ఈ నిర్ణయాలు కఠినంగానే అమలు చేస్తుందని పేర్కొంది. ఇక మిగిలిన 5 వేల రూట్లలో కూడా ప్రైవేటు వాహనాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇస్తుందని, అది గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే జరిగేది ఇదేనని, అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుందని తెలిపారు. ఈ రోజు ఈ పరిస్థితి వస్తుందంటే ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారు అని సీఎంఓ తెలిపింది..


మరింత సమాచారం తెలుసుకోండి: