ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ప్రధాన కార్యదర్శే బిగ్ బాస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అకాస్మత్తుగా బదిలీ చేయటం సంచలనంగా మారింది. దేశచరిత్రలోనే ఎక్కడా లేనట్లుగా సిఎస్ బదిలీ ఉత్తర్వులను ప్రిన్సిపుల్ సెక్రటరి అధికారి పేరుతో జారీ చేయించటమే కలకలం రేపుతోంది. సరే ప్రధాన కార్యదర్శి బదిలీపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి లేండి.

 

ఎల్వీని బదిలీ చేయవచ్చా  ? లేదా ? అన్న విషయాలను పక్కనపెడితే అసలు ఎల్వీని జగన్ ఇంత అకాస్మత్తుగా ఎందుకు బదిలీ చేశారు ? అన్న విషయమే పెద్ద చర్చనీయాంశంగా మారింది.  బదిలీకి సంబంధించి అధికారవర్గాలు, పార్టీవర్గాలు కొన్ని కారణాలను చూపుతున్నాయి. జగన్ ఇచ్చిన ఆదేశాలను ఎల్వీ తూచా తప్పకుండా పాటించాల్సిందే తప్ప వేరే దారిలేదు.

 

సమీక్షా సమావేశాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలను కూడా ఎల్వీ తొందరగా అమల్లోకి తీసుకురావటం లేదట. ఈమధ్య అందరికీ ఇళ్ళ స్ధలాల సేకరణ ఉన్నాతాధికారులతో సమీక్ష జరిగింది. ఆ సందర్భంగా  జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ స్ధలాలను వెంటనే  సేకరించాలని జగన్ ఆదేశించారట. తర్వాత కలెక్టర్లతో జరిగిన టెలికాన్ఫరెన్సులో ఎల్వీ మాట్లాడుతూ వివిధ మున్సిపాలిటీల్లో చెత్త డంపింగ్ చేయటానికి స్ధలాల సేకరణకే తొలి ప్రాధాన్యమని చెప్పారట.

 

వెంటనే జగన్ మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించటంతో అందరూ ఆశ్చర్యపోయారట. అలాగే వివిధ శాఖల్లో బాగా చురుకైన అధికారులను నియమించమని జగన్ గట్టిగా చెప్పారట. కొన్ని శాఖల్లో పోస్టింగులకు సంబంధించి జగన్ కొన్ని పేర్లను కూడా సూచించారట. అయితే వాళ్ళల్లో ఎవరికి కూడా ఎల్వీ ఇంతవరకూ ఆర్డర్లు ఇవ్వకపోవటంతో సిఎం మండిపోయారట. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుల ఎంపిక విషయంలో కూడా జగన్ చెప్పిన దానికి విరుద్ధంగా ఎల్వీ నడుచుకున్నారట. మొన్నటి క్యాబినెట్ సమావేశంలో అజెండాగా పెట్టమని జగన్ సూచిస్తే ఆర్ధికశాఖ అనుమతి లేదన్న కారణం చూపి అసలు అజెండాలోనే అంశాన్ని చేర్చలేదట.  ఇలా చాలా విషయాల్లో జగన్ చెప్పినవాటిని ఎల్వీ ఏదో ఓ కారణంతో ఆలస్యం చేస్తుండటంతో మండిపోయి చివరకు బదిలీ చేశారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: