నిన్న తెలంగాణ రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి నిందితుడు సురేశ్ విజయారెడ్డి సజీవదహనానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సురేశ్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సురేశ్ తాతకు ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఏడు ఎకరాల భూమి ఉంది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ భూములను కొనాలని రైతులతో విక్రయించేలా ఒప్పందం చేసుకుంది. 
 
కానీ ఆ భూములపై కోర్టు కేసులు ఉండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సాధ్యం కాలేదు. సురేశ్ తాత ఏడెకరాల భూముల్లో సురేశ్ తండ్రికి కేవలం రెండెకరాల భూమి మాత్రమే వాటాగా ఉంది. సురేశ్ చిన్నప్పటినుండి ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. నిందితుడు సురేశ్ కు మతిస్థిమితం కూడా సరిగ్గా లేదు. 
 
తహశీల్దార్ విజయారెడ్డి భూవివాదాన్ని పరిష్కరించనందుకు నిరసనగా సురేశ్ ను తహశీల్దార్ కార్యాలయానికి సురేశ్ పెద్దనాన్న దుర్గయ్య పంపినట్లు తెలుస్తోంది. సురేశ్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లక ముందు చాలాసార్లు పెద్దనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లు పోలీసులు సురేశ్ కాల్ డేటా ఆధారంగా గుర్తించారని సమాచారం. పోలీసులు ప్రస్తుతం పెద్దనాన్న దుర్గయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
విజయారెడ్డిని బెదిరించాలని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సురేశ్ అక్కడ తహశీల్దార్ విజయారెడ్డితో తీవ్ర వాగ్వాదం జరగటంతో క్షణికావేశంలో విజయారెడ్డి సజీవదహనానికి కారణమయ్యాడని తెలుస్తోంది. సురేశ్ తల్లి సురేశ్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని ఇంత దారుణానికి పాల్పడే ధైర్యం సురేశ్ కు లేదని మీడియాకు చెప్పింది. ఆరు నెలల నుండి సురేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని సమాచారం. చాలాసంవత్సరాల నుండి సురేశ్ తాతకు సంబంధించిన ఏడు ఎకరాల భూమి వివాదంలో ఉందని తహశీల్దార్ కార్యాలయానికి సురేశ్ తండ్రి, సురేశ్ పెద్దనాన్న మాత్రమే వెళ్లేవారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: