పార్టీ పదవుల నుండి సీనియర్ సిటిజన్లకు తొందరలో ఉధ్వాసన పలుకనున్నారా ? తాజాగా జరిగిన పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో మెజారిటి నేతల సూచనలు గనుక అమలైతే సీనియర్లకు మంగళం పాడటం తప్పదనే అనుకోవాలి.  పార్టీ పదవుల్లో సీనియర్ సిటిజన్లకు అవకాశం ఇవ్వద్దంటూ మెజారిటి నేతలు చంద్రబాబునాయుడు ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

 

శాప్ మాజీ ఛైర్మన్ పిఆర్ మోహన్ మాట్లాడుతూ తనతో పాటు కళావెంకట్రావు లాంటి చాలామంది సీనియర్ సిటిజన్లు అయిపోయిన కారణంగా పార్టీ పదవుల నుండి దూరంగా పెట్టాలని సూచించారు. మోహన్ సూచనకు మెజారిటి నేతలు వెంటనే మద్దతు పలికారు. అంటే సీనియర్ నేతలపై పార్టీ నేతలు ఏ స్ధాయిలో మండిపోతున్నారో అర్ధమవుతోంది. అధికారాన్ని అనుభవించటమే కానీ పార్టీకి చాలామంది నేతలు పెద్దగా పనిచేయలేదని ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి.

 

అయినా వారినే చంద్రబాబునాయుడు అందలం ఎక్కిస్తున్నారు. దాంతో మొన్నటి ఐదేళ్ళ కాలంలో కూడా మంత్రులకు పార్టీ యంత్రాంగానికి మధ్య పెద్ద గ్యాప్ వచ్చేసింది. మంత్రుల్లో ఎక్కువమంది తమ కుటుంబ సభ్యులను, తమ బంధువులు, మద్దతుదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. దాని ఫలితంగానే పార్టీ నేతలు, క్యాడర్ మొన్నటి ఎన్నికల్లో చాలామంది అభ్యర్ధులకు పనిచేయలేదు.

 

ప్రతిపక్షంలో ఉన్నపుడైన యువ నేతలకు అవకాశాలు ఇవ్వకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదంటూ విజయనగరం జిల్లా నేత ఐవిపి రాజు కుండబద్దలు కొట్టినట్లు చంద్రబాబుకు చెప్పారు. ఈ ప్రపోజల్ కు కూడా చాలామంది నేతలు వెంటనే తమ మద్దతు పలికటం గమనార్హం.

 

అంటే ఎక్కడ చూసినా సీనియర్లన్న పేరుతో యువ నాయకత్వాన్ని చాలామంది తొక్కేస్తున్నారు. ఎక్కడైనా యువనాయకత్వం వచ్చిందంటే అది కేవలం సీనియర్ నేతల వారుసులు మాత్రమే. నర్సీపట్నం, శ్రీకాళహస్తి, పత్తికొండ, రాప్తాడు, హిందుపురం లాంటి చాలా నియోజకవర్గాల్లో వారసులు ఒకవైపు రెచ్చిపోయి అడ్డదిడ్డమైన సంపాదన చేశారనే ఆరోపణలున్నాయి.

 

అదే సమయంలో తమకు అడ్డుగా ఉన్నారన్న ఏకైక కారణంతో చాలామంది నేతలను పార్టీకి దూరం పెట్టేశారు. దాంతో పార్టీ పుట్టిముణిగిపోయింది.  మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: