మహిళా తహశీల్ధార్ విజయారెడ్డి సజీవదహన ఘటన లో కొత్త ట్విస్ట్  వెలుగు లోకి వచ్చింది . విజయారెడ్డి పై పెట్రోలు పోసి నిప్పంటించిన  ప్రధాన నిందితుడు సురేష్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని తల్లితండ్రులు చెబుతున్నారు . అయితే ఈ దాడి, హత్యకు భూవివాదమే కారణమా ? అన్న ప్రశ్నకు వారు నేరుగా సమాధానం చెప్పకుండా ,  గౌరెల్లి గ్రామం రెవిన్యూ పరిధిలో తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూవివాదం ప్రస్తుతం హైకోర్టు లో కొనసాగుతున్న మాట నిజమేనని సురేష్ తండ్రి కృష్ణ , పెద్దనాన్న దుర్గయ్య లు అంగీకరించారు .


తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని తమ పేరిట చేయాలని తాము తహశీల్ధార్ కు దరఖాస్తు చేసుకున్నామని కానీ దానికి విజయారెడ్డి నిరాకరించిందని చెప్పారు . ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు . ప్రస్తుతం తామే భూమిపై కబ్జా లో ఉన్నట్లు వారు వెల్లడించారు . భూమిని తమ పేరిట మార్చలేదనే సురేష్ , విజయారెడ్డి పై దాడి చేసి సజీవ దహనానికి పాల్పడ్డారా ? అని ప్రశ్నించగా,  అసలు భూవివాదం గురించి సురేష్ కు ఏమి తెలియదని ఇద్దరు చెప్పుకొచ్చారు . సురేష్ పనిపాటు లేకుండా ఇంటి వద్దనే ఉండేవాడని , ఇటీవలే రియల్ ఎస్టేట్ అంటూ బయట తిరుగుతున్నారని , అతని మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదని పేర్కొన్నారు .విజయారెడ్డి ని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆమె భర్త సుభాష్ రెడ్డి  వాపోయారు .


 తన ఇద్దరు పిల్లలు అన్యాయమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు . అబ్దుల్లాపూర్ మెట్ నుంచి విజయారెడ్డి ట్రాన్స్ ఫర్ కోసం ఇటీవల ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు . తనకు ఎవరి నుంచైనా ప్రాణహాని ఉందని ఎప్పుడైనా చెప్పిందా ? అన్న ప్రశ్నకు తన భార్య ఆఫీస్ వత్తిళ్ళను ఇంట్లో కన్పించకుండా జాగ్రత్త పడేదని అన్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: