నిన్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ పెట్రోల్ పోయటంతో విజయారెడ్డి సజీవ దహనమైన విషయం తెలిసిందే. విజయారెడ్డి దంపతులకు 10 సంవత్సరాల కుమార్తె చైత్ర, 5 సంవత్సరాల కుమారుడు భువనసాయి ఉన్నారు. క్షణికావేశంలో సురేశ్ చేసిన హత్య వలన అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలు అన్యాయమయ్యాయి. తల్లికి ఏం జరిగిందో అర్థం కాని ఆ పసి హృదయాలు గుక్క పెట్టి ఏడుస్తూ ఉండటంతో ఆ పిల్లల పరిస్థితిని చూసి తండ్రి, బంధువులు బోరున విలపిస్తున్నారు. 
 
ఇద్దరు పిల్లలు తండ్రిని మమ్మీకి ఏమైందని ఇంటికి ఎప్పుడొస్తుందని అడిగే ప్రశ్నలకు తండ్రి పిల్లలను గట్టిగా హత్తుకొని రోదిస్తున్నాడు. రోజూ స్కూల్ కు రెడీ చేసే తల్లి, రోజూ ప్రేమగా గోరుముద్దలు కలిపి తినిపించే తల్లికి ఏమైందో అర్థం కాక చిన్నారులు ఏడుస్తున్నారు. తల్లి మృతితో ఆ చిన్నారులకు తల్లి లేని లోటును ఎవరు తీరుస్తారు..? అభం శుభం తెలియని ఆ పిల్లల ఆలనాపాలన ఎవరు చూస్తారు...? తమ తల్లికి ఏమో జరిగిందని రోదిస్తున్న ఆ పసి హృదయాలు తమ తల్లి తిరిగిరాదనే విషయం తెలిస్తే తట్టుకోగలవా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 
 
నిందితుడు సురేశ్ కు తహశీల్దార్ విజయారెడ్డితో ఏవైనా సమస్యలు ఉండవచ్చు. కానీ సురేశ్ చేసిన హత్య వలన ఆ పిల్లల జీవితాలకు అన్యాయం జరిగింది. ఏడుస్తూ అమాయకంగా ఆ పసిపిల్లలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా చెప్పలేక తండ్రి, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈరోజు తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలను నల్లగొండ జిల్లా ముల్లగోడు మండలం కల్వలపల్లిలో నిర్వహించనున్నారు. 
 
విజయారెడ్డి మృతితో ఆమె స్వగ్రామం నకిరేకల్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. విజయారెడ్డి తండ్రి లింగారెడ్డి జెడ్పీ హైస్కూల్ లో తెలుగు పండిట్ గా పని చేసి మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందాడు. విజయారెడ్డి సోదరి సంధ్యారాణి హైదరాబాద్ లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: