ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో తమ పరిధులకు లోబడే పని చేస్తారు. ప్రజల అవసరాలకు, కొన్ని ప్రభుత్వ విధానాలకు తేడాలుండటం సహజం కూడా. దీనిని ప్రజలు వ్యతిరేక ధోరణితో చూస్తే అధికారులెవరూ తమ విధులను నిర్వర్తించలేరు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి హత్యకు గురైన తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. విధి నిర్వహణలో ఉన్న ఉన్నతోద్యోగిని తన కార్యాలయంలోనే ఇలా హత్యకు గురికావడం ఉద్యోగుల రక్షణ ప్రశ్నార్ధకం అవుతోంది.

 


అధికారులతో మాట్లాడాలని వచ్చే వాళ్లు ఏ మనస్తత్వంతో వస్తారో చెప్పలేని స్థితి. గతంలో కూడా ఇలా ప్రభుత్వోద్యోగులపై దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం చిత్తూరు నగర మేయర్ అనురాధ కూడా ఇలానే తన కార్యాలయంలో విధి నిర్వహణలో ఉండగానే హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఆమెను, భర్త మోహన్ ను కార్యాలయంలోనే కాల్చి చంపారు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనలో నిందితుడు సొంత బంధువే. ఈ ఏడాది ఆగస్టులో నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న ఎస్సైను, ఇద్దరు కానిస్టేబుళ్లపై కొందరు స్టేషన్ లోనే వారిపై దాడి చేశారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులపైనే దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. కొన్నేళ్ల క్రితం నూజివీడు తాహసీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇటివల వెంకటాచలం ఎంపీడీవో సరళపై జరిగిన దాడి కూడా వార్తల్లో నిలిచింది.

 


కొన్ని సందర్భాల్లో రూల్స్ ప్రకారం, విధానాల ప్రకారం అధికారులు తమ పరిధిల్లోకి లోబడి పని చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజలకు నష్టం కలుగుతుందనేది నిజం. పరిష్కార మార్గాలు చూడకుండా బాధితులు ఇలా హత్యకు పాల్పడటం ఆటవిక చర్య. ఇటువంటి ఘటనలతో ఇరు కుటుంబాల్లో మానసిక క్షోభ, ఆవేదన మిగలడం తప్ప ఒరిగేదేం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: