గత ఆగస్టు నెలలో విజయవాడ గోశాలలో ఆవులు మృతి చెందిన ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు 86 ఆవులు మృతి చెందడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు  ఆదేశించింది. ఈరోజు ఆ నివేదికను సిట్ బృందం విజయవాడ సీపీకి అందజేసింది. 

 

 

అవులకు వేసిన పశుగ్రాసంలో నైట్రేట్ శాతం ఎక్కువ కావడంతో ఆవులు మృతి చెందినట్టు సిట్ బృందం విచారణలో తేలింది. 2 నుంచి 3 శాతం మేర అధికంగా ఉన్న నైట్రేట్లు ఆవులు తిన్న పశుగ్రాసంలో కలిసినట్టు అధికారులు తమ విచారణలో తేల్చారు. ఈ నైట్రేట్లు విషపూరితంగా మారి ఆవుల మృతికి కారణమైనట్టు నివేదికలో పొందుపరిచారు. ఆగస్టు 10వ తేదీ అర్థరాత్రి జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా.. ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. దీనిపై వివిధ ప్రయోగశాలల్లో పశుగ్రాసంపై పరీక్షలు జరిపించారు. అయితే.. ఎక్కడా విషప్రయోగం జరిగినట్టు ఆధారాలు లభించలేదు. పచ్చిగడ్డిలో ఉండే నైట్రేట్లు కంటే ఆవులు తిన్న గడ్డిలో నైట్రేట్లు ఎక్కువ ఉన్నట్టు ప్రయోగాల్లో తేలింది. 1.6 శాతం లోపు ఉండాల్సిన నైట్రేట్ శాతం అంతకు దాదాపు రెట్టింపు ఉండడంతో ఆవులు మృతి చెందినట్టు నివేదికలో తెలిపారు.

 

 

దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్ కు ప్రాణవాయువు తీసుకెళ్లే సామర్ధ్యం తగ్గి ఆక్సిజన్ అందక గోవులు మృతి చెందాయని కూడా తేల్చారు. ఈ సిట్ బృందాన్ని విజయవాడ సీపీ ద్వారకాతిరుమల రావు ఏర్పాటు చేశారు. మూడు నెలల విచారణ అనంతరం ఈరోజు దర్యాప్తు నివేదికను సిట్ అందజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: