సాధారణంగా బైక్ పై ఆఫీసులకు వెళ్లే వాళ్లు హెల్మెట్ పెట్టుకునే రోడ్డెక్కుతారు. ఎందుకంటే ఇటీవల ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం కావడంతో తప్పని పరిస్థితుల్లో వాహనదారులు ఇలా చేస్తున్నారు. ఒకవేళ పట్టుబడితే భారీ ఫైన్ లు కట్టకతప్పదనే భయంతో హెల్మెట్ వాడకాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఉత్తప్రదేశ్ లోని బాందా జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా అందరు వాహనదారుల్లానే ప్రవర్తిస్తున్నారు. ఇంటి నుంచి ఆఫీసుకు బయల్దేరేటపుడు హెల్మెట్ తప్పని సరి అనే నిబంధనను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంతా బాగుంది.. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించే ఒక విషయం కూడా ఇక్కడ ఉంది. 


రోడ్డుపై ప్రయాణించేటపుడు హెల్మెట్ పెట్టుకోవడం సరే.. మరి ఆఫీసుకు వెళ్లినపుడు ఆ హెల్మెట్ తీసి పక్కన పెట్టి వాళ్లపని వాళ్లు చూసుకోవాలి. కానీ ఆ విద్యుత్ ఉద్యోగులు అలా చేయడం లేదు. హెల్మెట్ అలానే పెట్టుకొని తమ పని తాను చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్ వాహన సవరణ చట్టం 2019పై ఉన్న భయంతో వీళ్లిలా చేస్తున్నారని అనుకుంటే మనం పొరపాటుపడ్డట్టే. తాము పనిచేసే చోట తమ ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఈ ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకునే విధులు నిర్వర్తిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. బాందా జిల్లాలోని విద్యుత్ శాఖకు చెందిన ఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడి రాలిపోతున్న పైకప్పు.. ఎపుడు కూలి మీద పడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.  కాసింత వర్షానికే.. పైనుంచి నీళ్లు జలజలా కారుతూ ఉంటాయి. బయట ఉన్నామా.. ఆఫీసులో ఉన్నామా అనే తేడా ఉండదు. ఈ దుస్థితి గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఉద్యోగులే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. హెల్మెట్ పెట్టుకునే విధులు నిర్వర్తించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నా.. వారికి మాత్రం తప్పనిసరి అయింది. ఆఫీసులో హెల్మెట్లు ధరించి పనిలో బిజీ అయిన ఉద్యోగుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


భవనం శిథిలావస్థకు చేరుకోవడమే కాదు... చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాంతాడంత సమస్యలున్నాయి. సౌకర్యాలలేమితో విద్యుత్ ఉద్యోగులు ప్రతీరోజూ కుస్తీ పడుతూనే ఉంటారు. ఫైళ్లు భద్రపరుచుకునేందుకు అల్మారాలు లేకపోవడం.. విరిగిపోయిన కుర్చీలు.. వర్షం పడితే గొడుగులు పట్టుకుని పనిచేసే పరిస్థితులు ఇక్కడ దాపురించాయి. ఇంత జరుగుతున్నా పై అధికారులకు చీమకుట్టినట్టయినా లేదు. పై కప్పు కూలి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదేమో అని విద్యుత్ ఉద్యోగులు వాపోతున్నారు. అప్పుడే భవన నిర్మాణానికి మోక్షం కలుగుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పై అధికారులు ఇంతవరకు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: