టీటీడీలో జీఓ నెంబర్ 2323అమలు మొదలయింది. దీని ప్రకారం ఇప్పటికే 194 మందికి ఉద్వాసన పలికారు. మరో 3 విభాగాల నుంచి నివేదికలు అందాల్సి ఉంది. అయితే  శ్రీవారి ఆలయంలోని అర్చకులకు జీఓ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని టీటీడీ కోరింది. 


ఈ ఏడాది మార్చి 31కి ముందు నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులను, 40 వేలు పైబడి జీతం పొందుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలంటూ విడుదల చేసిన రాష్ర్ట ప్రభుత్వ జీఓ 2323 టీటీడీలో అమలవుతోంది. నిజానికి ఈ జీవో గత నెల 18నే విడుదలైనా... ఇది టీటీడీకి వర్తిస్తుందా? లేదా? అనే సంశయంతో అమలు చేయలేదు.  


అయితే జీవో 2323 నిబంధనలు టీటీడీకి కూడా వర్తిస్తాయని ప్రభుత్వం నుంచి వివరణ అన్ని విభాగాల్లో ఉద్యోగులను గుర్తిస్తూ తొలగించడం ప్రారంభించారు అధికారులు. దీంతో ఇప్పటికే 26 విభాగాలకు సంభందించిన 194 మంది ఉద్యోగులును తోలగించారు. మరో 3 విభాగాల నుంచి నివేదికలు అందాల్సి ఉంది.


జీఓ 2323 అమలుతో  టీటీడీ ప్రధాన విభాగాలకు సంబంధించిన ఉద్యోగులను తొలగించారు. అన్నప్రసాద ట్రస్ట్ ప్రత్యేక అధికారి వేణుగోపాల్, మ్యూజియం డైరెక్టర్ కల్నల్ చంద్రశేఖర్, కళ్యాణం ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్ రావు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి, ఇతర ప్రాజెక్టులకు చెందిన మేడసాని మోహన్, సముద్రాల లక్ష్మయ్య, చెంచు సుబ్బయ్య వంటి పండితులును టీటీడీ తొలగించింది. ఇక డియల్ఓ వేంకట సుబ్బానాయుడుని  తొలగించడంతో టీటీడీ న్యాయ విభాగం ఖాళీ అయిపోయింది. ఇప్పటికే లా ఆఫీసర్ గా సిట్టింగ్ జడ్జిని నియమించే అవకాశం లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పడంతో రిటైర్డ్ జడ్జినే నియమించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక నూతన జీఓతో ఈ ప్రకియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. 


ఇక జీఓ 2323ని శ్రీవారి ఆలయంలోనూ అమలు చెయ్యాల్సివస్తే ముగ్గురు ప్రధాన అర్చకులతో పాటు మరో 15 మంది అర్చకులు, డాల్లర్ శేషాద్రిని కూడా తొలగించే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో శ్రీవారి ఆలయానికి జీవో నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది టీటీడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: