మొన్నటి ఎన్నికల్లో జనసేనకు యువత కూడా ఓట్లేయలేదా ? అవుననే చెబుతున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతు  తన సభల్లో పాల్గొన్న యువత కూడా చివరకు పార్టీకి ఓట్లేయలేదన్నారు. తాను పాల్గొన్న ప్రతి బహిరంగ సభలోను, సమావేశంలోను చివరకు రోడ్డు షోల్లో కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

 

ఎన్నికలకు ముందు తనతో పాటు అన్నీ కార్యక్రమాల్లో పాల్గొన్న యువత చివరకు ఎన్నికలకు వచ్చేసరికి జనసేనకు ఎందుకు ఓట్లేయలేదో తనకు ఇప్పటికీ అర్ధం కావటం లేదన్నారు. తన సభలకు, రోడ్డుషోలకు, సమావేశాల్లో పాల్గొన్న యువతలో కనీసం 70 శాతం జనసేనకు ఓట్లేసున్నా పార్టీకి 70 సీట్లు వచ్చుండేవని పవన్ అనటమే విచిత్రంగా ఉంది.

 

మొత్తానికి పవన్ కు ఇంత కాలానికి ఓ విషయం అర్ధమైనట్లుంది. సభలకు, సమావేశాలకు, రోడ్డు షోల్లో పాల్గొన్నంతమాత్రాన  ఆయా పార్టీలకు ఓట్లేయరని. పక్కనే వామపక్షాలను పెట్టుకుని కూడా వపన్ కు వాస్తవం బోధపడటానికి ఇంతకాలం పట్టిందంటేనే ఆశ్చర్యంగా ఉంది. వామపక్షాలు ఎక్కడ ఆందోళనలు చేసినా, సమావేశాలు నిర్వహించినా జనాలు మాత్రం విపరీతంగా వస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఎన్నికల్లో చూస్తే అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా రావు.

 

మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు సుమారుగా 16 లక్షలు. అంటే కాంగ్రెస్, బిజెపిలకన్నా ఎక్కువ ఓట్లనే తెచ్చుకుంది. అలాగే ఓ 20 నియోజకవర్గాల్లో డిపాజిట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్, బిజెపిల అభ్యర్ధులకైతే అసలు డిపాజిట్లు కూడా రాలేదు. పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఓడిపోవటమే పెద్ద ఇబ్బందిగా మారింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబునాయుడో కలిసిన ఫలితమే జనసేన  పైన పడిందని ఇప్పటికీ పవన్ గ్రహించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: