మాజీమంత్రి గంటాశ్రీనివాస్ మైండ్ గేమ్ మరోసారి హాట్ టాపిక్ అయింది.  హైకమాండ్ ఆదేశించినా... ఊళ్ళోనే ఉండి కూడా జనసేన లాంగ్ మార్చ్ కు గైర్హజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. గంటా పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే  పవన్-గంటాల మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యం వల్లే లాంగ్ మార్చ్ కు గంటా డుమ్మాకొట్టారనే వాదన వుంది.  


జనసేన లాంగ్ మార్చ్ గ్రాండ్ సక్సెస్ రాజకీయంగా ఎంత వేడిని పుట్టించిందో.... మాజీమంత్రి గంటా శ్రీనివాస్ గైర్హాజర్ అదే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భవన నిర్మాణ కార్మికులకు పక్షాన జనసేన చేపట్టిన నిరసన ర్యాలీకి అన్నిపార్టీలు  సంఘీభావం ప్రకటించాయి. ఇసుక కొరతపై తమ పార్టీ వేదికలపై పోరాడుతున్న వేళ... అఖిలపక్షంగా ఏర్పడి పోరాడాలన్న జనసేన ప్రతిపాదనకు బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు విముఖత వ్యక్తం చేశాయి. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ లాంగ్ మార్చ్ కు బహిరంగ మద్దతు ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులైన మాజీమంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడులు హాజరవుతారని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే లాంగ్ మార్చ్ కు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. జనసేన-టీడీపీ కలిసి పోరాటం చేయడంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపణలు వ్యక్తం చేయడంతో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా ఉంది.   


అదే సమయంలో మాజీమంత్రి గంటాశ్రీనివాస్ వ్యవహారశైలి అనేక అనుమానాలకు తావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత గంటాశ్రీనివాస్ తటస్ధ వైఖరిని అనుసరిస్తున్నారు. పార్టీ వేదికగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ జరుగుతున్న ఆందోళనలకు డుమ్మా కొడుతు న్నారు. గత నెల 24న రాష్ట్రవ్యాప్తంగా ఇసుక నిరసనను చేపట్టింది టీడీపీ. విశాఖలో భారీ స్ధాయిలో ఈ కార్యక్రమం జరిగినప్పటికీ ఎమ్మెల్యే గంటా జాడ మాత్రం కనపడలేదు. 


ఈ తరుణంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జనసేన చేసిన లాంగ్ మార్చ్ కు మద్దతుగా నిలబడాలన్న పార్టీ ఆదేశాలను గంటా పట్టించుకోలేదు. సభ జరుగుతున్న సమయానికి నగరంలోనే ఉండి కూడా ఆయన హాజరవ్వకపోవడంపై అనేక ఊహాగానాలు నెలకొన్నాయి. గంటా పార్టీ మారతారని గట్టిగా వినబడుతున్న వేళ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై జరుగుతున్న నిరసన కార్యక్రమానికి హాజరవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: