లాంగ్‌మార్చ్ పేరుతో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన యాత్ర‌, ఆయ‌న చేసిన కామెంట్ల గురించి వైసీపీ నేత‌, వ్యవసాయ మంత్రి కె.కన్నబాబు తాజాగా మీడియా సమావేశంలో స్పందించారు. అధికారం చేపట్టిన కేవలం 5 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసిన ప్రభుత్వాన్ని చూసి, ఏం చేయాలో తోచక ఇసుక కొరత అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. ``ప్రభుత్వం ఇసుకను దాచిపెట్టి కృతిమ కొరత సృష్టించినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. భారీ వరదలు, వర్షాల వల్ల ఇసుక తీయడం సాధ్యం కాలేదు. రాష్ట్రంలో కొంత ఇసుక కొరత ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. కానీ సమస్యను అడ్డం పెట్టుకుని గుంటనక్కలా విపక్షం వ్యవహరిస్తోంది. ఇసుక సమస్య మరో 15 రోజుల్లో పరిష్కారం కానుంది. ఈ విషయం తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారు.`` అని మండిప‌డ్డారు.


టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా పవన్‌కళ్యాణ్‌ బయటకు వస్తారు....ఏదో ఒక కార్యక్రమం చేపడతారు...విమర్శలు గుప్పిస్తారు అని ఆరోపించారు. ``ఇదే ఒర‌వ‌డిలో తాజాగా విశాఖలో లాంగ్‌ మార్చ్‌ పేరుతో షో చేశారు. ఒక్క అడుగు కూడా నడవకుండా వాహనంపై ఊరేగారు. పక్కనే  ఇసుక దోపిడి చేసిన టీడీపీ నేతలు కె.అచ్చెన్నాయుడు, సీహెచ్‌.అయ్యన్నపాత్రుడికి పెట్టుకుని మాట్లాడారు. మంత్రిగా అచ్చెన్నాయుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించాడు. ఇక అయ్యన్నపాత్రుడు కుమారుడు చిరంజీవిపై ఎన్నో విమర్శలు చేశారు. అయినా ఆయనను పక్కన పెట్టుకుని పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగించారు. పవన్‌ కళ్యాణ్‌ గతంలో ఏరోజైనా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గళం ఎత్తారా? భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి కోసం గతంలో ‘ఛలో కాకినాడ’ చేపట్టినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వారికి ఎందుకు వారికి మద్దతు ఇవ్వలేదు?`` అని నిల‌దీశారు. 


ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలలే అయిందని అయితే...నెల తిరగక ముందు నుంచే చంద్రబాబు, ఆయన పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెట్టారని ఆరోపించారు. `` తనను దత్తపుత్రుడు అన్నారని పవన్‌ విమర్శిస్తున్నారు. ఒకవైపు పవన్, మరోవైపు లోకేష్‌ రాష్ట్రంలో పర్యటిస్తూ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. మరి దత్తపుత్రుడు అనక ఏమంటారు?
ఇవాళ మారుమూల ప్రాంతాల్లో కూడా డిస్సోజల్స్‌ వాడుతున్నారు. కానీ పవన్‌కు ఆ మట్టి పిడతలు ఎక్కడ దొరికావో ఎవరికీ తెలియదు. కారు డిక్కీలో కూర్చుని టీ తాగుతారు. ట్రెయిన్‌లో టాయిలెట్‌ పక్కన కూర్చుని పుస్తకాలు చదువుతారు. వర్షం కురుస్తుంటే గొడుగు వేసుకుని ఆవుకు అరటిపండ్లు పెడతారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ తరహా డ్రామాలు చంద్రబాబు డైరెక్షన్‌లో చేస్తే, వెంటనే వాటిని విడిచి పెట్టండి. ఎందుకంటే సినిమాల్లో మాదిరిగా నటిస్తూ డైలాగ్‌లు కొడితే ఓట్లు పడవు `` అని ఎద్దేవా చేశారు.


అసలు సీఎం వైయస్‌ జగన్‌కు, పవన్‌కు పోలిక ఏమిటని క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు. ``జగన్‌కు 151 సీట్లు వచ్చాయి. 50 శాతం ఓట్లు సంపాదించారు. జగన్‌ను  చూసి సంస్కారం నేర్చుకోవాలి. 151 స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెల్చినా ఎంత ఒదిగి ఉంటున్నారో చూడండి. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే ఈ విధంగా వ్యవహరిస్తే ఎలా? టీడీపీ, జనసేన పార్టీలు వైయస్సార్‌సీపీకి రాజకీయ ప్రత్యర్థులు. ప్రభుత్వంలో తప్పులు ఉంటే చెప్పండి. అంతేకానీ ప్రతిదీ తప్పుగా చూపకండి. అలా చూపే ప్రయత్నం చేయకండి. పవన్‌ కళ్యాణ్‌ 2 లక్షల పుస్తకాలు చదివానంటున్నారు. వాటిలో ఎక్కడైనా వరదల్లో ఇసుక ఎలా తీయాలని ఉంటే చెప్పండి. వెంటనే ప్రయత్నిస్తాము. జనసేనకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటీవల ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభినందిస్తూ పాలాభిషేకం చేశారనేది గుర్తుంచుకోవాలి`` అని వ్యాఖ్యానించారు.
కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుందని పవన్‌ అన్నారని పేర్కొంటూ అక్రమ కట్టడాలు కూల్చవద్దా? అని నిల‌దీశారు. `` నిజం చెప్పాలంటే చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కూలుస్తారని పవన్‌ భయం.  రెండున్నర కిలోమీటర్ల నడకను లాంగ్‌ మార్చ్‌గా చెబితే, 3648 కి.మీ నడిచిన వైయస్‌ జగన్‌ యాత్రను ఏమనాలి? పవన్‌ స్థిరంగా నిలబడి ఎక్కడైనా కనీసం ఒక్క నిమిషం అయినా మాట్లాడగలుగుతాడా? ఆయన ఊపులు, అరుపులకు ఎవరూ భయపడరు`` అని స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: