తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసి జేఏసీ కి ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  విధుల్లో చేరడానికి ఆర్టీసి కార్మికులకు నవంబర్ 5 వరకు గడువు ఇవ్వగా కేవలం 11 మంది ఆర్టీసి కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు.  ఈ నేపథ్యంలో జేఏసీ నేతలు, రాజకీయ పార్టీలు, సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు, ప్రజా సంఘాలతో ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన డెడ్‌లైన్‌ పై చర్చించారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా కార్మికులు చెక్కుచెదరలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు.


తమ డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది ప్రసక్తి లేదని చెప్పారు. "కార్మికులు ఎవరూ ఎక్కడా విధుల్లో చేరలేదు. నిన్న, మొన్న వెళ్లినవారిలో కూడా చాలా మంది వెనక్కి వచ్చేశారు. ఇదే పోరాట పటిమను కొనసాగిస్తాం. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ స్పందించి చర్చలతోనే పరిష్కరించాలి, 20 మందికి పైగా కార్మికులు చనిపోతే ఏ ఒక్క అధికారి కూడా సానుభూతి తెలపలేదు. ఆత్మహత్యలు చేసుకోవద్దనీ విజ్ఞప్తి చేయలేదు.

కానీ జేఏసీగా మేం మానవతావాదంతో స్పందించి అధికారులపై జరిగిన దాడులను ఖండిస్తున్నాం. ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా సమ్మె యథావిథిగా కొనసాగుతుంది." అని అశ్వథామరెడ్డి పేర్కొన్నారు. 


"ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంది. ఎలాంటి మార్పులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. కెసిఆర్ ఆర్టీసి పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం గా ఉన్నాయి. ఆర్టీసి ని తీసేయాలంటే తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా కేంద్రం అనుమతి తీసుకోవాలి" అని అశ్వథామరెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించరని స్పష్టం చేసారు ఆర్టీసి జేఏసీ కన్వీనర్ అశ్వథామరెడ్డి. గురువారం ఆర్టీసి సమ్మె పై హైకోర్టు లో విచారణ వున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: