తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 32వ రోజుకు చేరుకుంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డెడ్ లైన్ నేటి అర్థరాత్రితో ముగియనుంది. సీఎం ఇచ్చిన పిలుపుతో విధుల్లో చేరేందుకు వెళ్తున్న నిర్మల్ జిల్లా బైంసా డిపో మేనేజర్ జనార్దన్ పై గుర్తు తెలియని దుండగులు ముసుగు వేసి పిడిగుద్దులతో దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

 

 

ఈ దాడిని ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. దాడి ఘటన వివరాలు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకుంటామని జిలా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. కార్మికులపై దాడులు చేసినా, సంస్థ ఆస్తులకు నష్టం కలిగించినా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈ దాడి వివరాలు తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి ఈ దాడిని ఖండించారు. దాడితో కార్మికులకు ఏమీ సంబంధం లేదని అన్నారు. మంగళవారం అర్థరాత్రిలోపు విధుల్లో చేరితేనే ఉద్యోగం ఉంటుందని లేకుంటే ఉద్యోగంతోపాటు ఆర్టీసీ కూడా ఉండదని కేసీఆర్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన 5వేల రూట్లను కూడా ప్రయివేటు పరం చేస్తామని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పలువురు ఉద్యోగులు విధుల్లో చేరుతున్నారు.

 

 

మరోవైపు పెద్దపల్లి జిల్లాలో కొందరు ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. ఇప్పటికి పలు చోట్ల దాడులు జరిగాయి.  మరోవైపు సీఎం విధించిన డెడ్ లైన్లను కొందరు పట్టించుకోవటం లేదు. డిమాండ్లు నెరవేరేవరకూ సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. సీఎం ఇచ్చిన డెడ్ లైన్ ఓవైపు, కార్మిక సంఘాల పంతం మరోవైపు. దీంతో నేటి అర్థరాత్రి తర్వాత పరిస్థితిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: