కారు గుర్తు పోలిన సింబల్స్ ఎప్పటికయినా డేంజర్ అని టీఆర్ఎస్ భావిస్తోందా? ఈ అంశంపై మారోసారి ఈసీని కలవాలని గులాబీ పార్టీ అనుకుంటుందా? హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కూడా కారు గుర్తును పోలిన సింబల్ కి ఓట్లు పోల్ అయ్యాయని టీఆర్ఎస్ అంచనాకు వచ్చిందా? అసలు... కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ కారు గుర్తు మార్చటానికి ఛాన్స్ ఉందా?  


తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును కొనసాగించటంపై పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. కారు...ట్రక్కు గుర్తులు కొంచెం తేడాతో చూడటానికి ఒకేలా కనిపిస్తుంటాయి. ఇలా ఉన్నపుడు నిరక్షరాస్యులు ట్రక్కు గుర్తుకే ఎక్కువ ఓట్లు వేస్తున్నట్లుగా టీఆర్ఎస్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో కొంత మంది అభ్యర్థులు ఓటమి పాలయ్యారు అని టీఆర్ఎస్ అంతర్గత విశ్లేషణలో తేలింది. నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం ఓటమికి ఇదే కారణమని టీఆర్ఎస్ ఓ అంచనాకు వచ్చింది. అక్కడ చాలామంది నిరక్ష్యరాస్యులు, గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ట్రక్కుకే ఓటు వేసినట్లు టీఆర్ఎస్ గుర్తించింది. వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య 8 వేల 2 వందల 59 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వీరేశంకు 85 వేల 4 వందల 40 ఓట్లు, లింగయ్యకు 93 వేల 6 వందల 69 ఓట్లు దక్కాయి. ఇక్కడ సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్ తరఫున ట్రక్కు గుర్తుతో పోటీచేసిన అభ్యర్థి దుబ్బ రవికుమార్‌కు 10 వేల 3వందల 83ఓట్లు పోలయ్యాయి. ఇక... పలు నియోజకవర్గాల్లో చాలా వరకు ఓట్లు ట్రక్కు గుర్తుకు మళ్లాయన్నది అప్పట్లో గులాబీ పార్టీ విశ్లేషణ చేసుకుంది. దీంతో స్వయంగా కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కారు గుర్తు పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరారు. ఇక దీనిపై సానుకూలంగా స్పందించిన ఈసీ ట్రక్కు గుర్తును ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించింది.


అయితే... గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉపఎన్నికలో జాగ్రత్తలు తీసుకుంది. కారు గుర్తుపై పూర్తి అవగహన కల్పించేందుకు ఓటర్ల వద్దకు డమ్మీ ఈవీఎంలు ఉపయోగించింది టీఆర్ఎస్. అప్పటికి టీఆర్ఎస్ కారు గుర్తు పోలి ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థికి టీడీపీ, బీజేపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినట్టు గుర్తించింది గులాబి పార్టీ. దీంతో మరోసారి కారు గుర్తు పోలిన సింబల్స్ పై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కారు గుర్తును పోలిన సింబల్స్ జాబితా రెడీ చేసి... ఈసీని సంప్రదించాలని నేతలకు స్పష్టం చేశారు.


మొత్తానికి... త్వరలోనే ఈ గుర్తుల వ్యవహారంపై ఈసీని కలిసేందుకు టిఆర్ఎస్ రెడీ అవుతోంది. ఇందుకు అవసరమైన సమాచార సేకరణ మొదలు పెట్టింది గులాబీ పార్టీ.

మరింత సమాచారం తెలుసుకోండి: