2 నెలల క్రితం విజయవాడ నగర శివారులోని తాడేపల్లి గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందిన సంఘటన  రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో కలచివేసింది. అసలు గోవుల మృతి కి కారణాలు తెలియక బాధపడుతుంటే ఎన్నో పుకార్లు షికారు చేసాయి. కానీ గోవుల మృతిపై దర్యాప్తు చేసిన సిట్.. తన నివేదికను సమర్పించింది. ఆగస్టు, 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన తాడేపల్లెలో గ్రాసం తిన్న వెంటనే 86 ఆవులు మరణించాయి.

ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని గో సంరక్షులు, గో ప్రేమికులు.. రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే సుధీర్ఘంగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు.. గోవుల మృతికి గల కారణాలను తేల్చారు. ఆ రోజు గోవులకు పెట్టిన  గ్రాసమే.. ఆవుల మరణాలకు కారణమని తేల్చింది సిట్.

ఆ గ్రాసంలో అధికంగా నైట్రేట్లు ఉండటంతో తిన్నవెంటనే.. ఆ గ్రాసం విషపూరితంగా మారి.. మరణాలకు కారణమైందని వివరించింది. పరిసోధనలో పశుగ్రాసంలో ఉండాల్సిన నైట్రేట్ల శాతంలో భారీ తేడాలు ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా 1.6 శాతం ఉంటుందని.. అయితే ఘటన జరిగిన రోజు.. గోవులు తిన్న గ్రాసంలో 2 నుంచి 3 రెట్లు అధికంగా ఈ నైట్రేట్ల శాతం ఉండటంతో.. ఆ గ్రాసం విష పూరితంగా మారినట్లు సిట్ నివేదికలో తేలింది.

మృతి చెందిన గోవులు తిన్న ఆ గ్రాసంలో 3.79 గ్రాముల నుంచి 4 .47 గ్రాముల వరకు నైట్రేట్లు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఎక్కువ శాతం నైట్రేట్లు.. హీమో గ్లోబిన్‌లోకి వెళ్లిన తర్వాత చర్య జరిగి మెత్‌ హీమోగ్లోబిన్‌గా మారింది. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్‌కు ప్రాణవాయువును తీసుకెళ్లే సామర్థ్యం తగ్గడంతో శ్వాస ఆగిపోయి గోవులు మృతి చెందాయని తేలింది.ఎఫ్ఎస్‌ఎల్ ల్యాబ్, వెటర్నరీ ల్యాబ్, పరిశోధన ల్యాబ్ పరీక్షల అనంతరం.. సిట్ ఈ వివరాలను వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: