దేశ రాజధానిలో లాయర్లు, పోలీసులకు మధ్య ఘర్షణ రోజుకో రూపం దాలుస్తోంది. ఈ రోజు ఢిల్లీ పోలీసులు, అధికారులు పోలీసు ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శనివారం తీస్ హజారీ కోర్టు, సోమవారం సాకేత్  కోర్టులో జరిగిన ఘర్షణలతో ఢిల్లీ లాయర్లు, పోలీసుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. 


ఢిల్లీలో లాయర్లు పోలీసుల మధ్య జరిగిన గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. లాయర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు పోలీసులు నిరసనలకు దిగారు. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ రంగంలోకి దిగి పోలీసులను శాంతిపజేసేందుకు ప్రయత్నించారు. పోలీసులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని వెంటనే నిరసనలు మానేసి విధుల్లో చేరాలంటూ ఆయన పోలీసులను కోరారు. పోలీస్ కమిషనర్ చెప్పినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. దాడికి సంబంధించి పోలీసులకు హైకోర్టులో న్యాయం జరుగుతుందని కమిషనర్ అమూల్య పట్నాయక్ చెప్పారు. అయితే సోమవారం కూడా పోలీసులపై లాయర్లు దాడి చేయడం అనేది క్షమించరానిదన్న కమిషనర్ దీనిపై చట్టపరంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.


ముందుగా కొంతమంది పోలీసులు మాత్రమే  నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఈ వార్త  తెలిసి వందల సంఖ్యలో పోలీసులు తమ విధులకు బ్రేక్ ఇచ్చి పోలీస్ హెడ్‌ క్వార్టర్స్‌ కు చేరుకుని గొంతు కలిపారు. గంటగంటకు నిరసనల్లో పాల్గొనే పోలీసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతేకాదు ఒక మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. 


ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ గా  వ్యవహరించిన ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీ మళ్లీ రావాలంటూ ఢిల్లీ పోలీసులు నినదించారు. కిరణ్ బేడీ ఫోటోతో ఫ్లకార్డులను ప్రదర్శించారు. తాము నిరసనలు చేపట్టేందుకు రాలేదని తమ బాధను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చామన్నారు. న్యాయవృత్తిలో ఉన్నవారే పోలీసులపై చేయి చేసుకుంటే సామాన్య ప్రజలు తమను లెక్కచేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


తీస్ హజారీ కోర్టులో పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్లకు మధ్య శనివారం గొడవ జరిగింది. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో 40 మంది లాయర్లకు కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను బాధించింది.


అయితే ఈ గొడవ జరుగుతుండగానే  సోమవారం  మరికొంతమంది పోలీసులపై లాయర్లు దాడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న కెమెరాల కంటికి చిక్కాయి. సాకేత్ కోర్టు బయట ఓ కానిస్టేబుల్పై కొందరు లాయర్లు దాడి చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇక దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ వెంటనే తన బైక్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం తెలిసి కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై నిరసనలకు దిగారు కానిస్టేబుళ్లు.


అయితే పోలీస్ కమిషనర్ ప్రసంగిస్తున్నంత సేపు వీవాంట్ జస్టిస్ అనే నినాదాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. సోమవారం జరిగిన ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశించిందని చెప్పారు పట్నాయక్. నిస్పపక్షపాతంగా, పారదర్శకతతో కూడిన విచారణ జరుగుతుందని పట్నాయక్ హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: