ఆర్టీసీలో ప్రయివేటు భాగస్వామ్యం పెంచుతున్నామని అదికూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మోటారు వాహనాల చట్టం ద్వారానే  అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే,కార్మికులు  మంగళవారం అర్దరాత్రిలోగా తమ విధుల్లో చేరకపోతే అన్ని రూట్లనూ ప్రయివేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే పూర్తి ప్రయివేటీకరణకు కొత్త చట్టం ప్రకారం ఎటువంటి అవకాశం లేదనే వాదనలు  వినిపిస్తున్నాయి .


ఇటీవల కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది . దీని ద్వారానే  భారీగా నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నారు. ప్రయివేటు రంగాన్ని ప్రజా రవాణా వ్యవస్థలో ఆరోగ్యకరమైన పోటీ కోసం ప్రోత్సహించాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. సవరణకు ముందున్న చట్టంలోనూ ప్రయివేటుకు భాగస్వామ్యం ఉండేది. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీలో 21 శాతం ప్రయివేటు బస్సులున్నాయి. కానీ కొత్త చట్టం ప్రకారమే 5 వేల రూట్లలో ప్రయివేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. తుది గడువు తర్వాత కూడా కార్మికులు విధుల్లోకి రాకపోతే మిగతా 5 వేల రూట్లను ప్రయివేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మొత్తం అర్టీసీని ప్రయివేటీకరించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.


కొంత మంది విపక్ష నేతలు  ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడం అంటే మొత్తం ఆర్టీసీని ప్రయివేటీకరించడం కాదని అంటున్నారు. చట్టం ప్రకారం ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం  లేదని వాదిస్తున్నారు. అసలు ఉమ్మడి ఎపిఎస్ ఆర్టీసీ అధికారికంగా విడిపోలేదని ఆర్టీసీ జెఎసి వాదిస్తోంది. తాము ఇప్పటికీ ఎపిఎస్ ఆర్టీసీ ఉద్యోగులమే అని జెఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. ప్రయివేటీకరణ, ఉద్యోగాల తొలగింపు అధికారం తెలంగాణ ముఖ్యమంత్రికి లేదని ఆయనన్నారు.


 అన్ని రూట్లనూ ప్రయివేటీకరించే అధికారం ప్రభుత్వానికి ఉందా అనే చర్చ జరుగుతోంది. ఆ అధికారం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విపక్ష నేతలు  మాత్రం అలాంటి అధికారం లేదని వాదిస్తున్నారు. ఒక వేళ అన్ని రూట్లను ప్రయివేటీకరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయడానికి సంకల్పిస్తే వివాదానికి దారి తీయవచ్చని పరిశీలకులు చెప్తున్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉందా అనేది కూడా చర్చనీయాంశం అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: