కర్ణాటకలో ఓ ఆడియో క్లిప్ సంచలనం కలిగిస్తోంది. సీఎం యడియూరప్ప అప్పటి బీజేపీ నేతలతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడానికి అమిత్‌ షా ఆదేశాల మేరకే ఆపరేషన్ కమల్ జరిగిందని ఈ మాటలు చెప్తున్నాయి. దీనిపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 


కన్నడ రాజకీయాలు అనూహ్యంగా వేడెక్కాయి. సీఎం యడియూరప్ప మాట్లాడినట్టు చెప్తున్న వీడియో క్లిప్పింగ్ కలకలం రేపుతోంది. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేల గురించిన సంచలన అంశాలు ఆ క్లిప్‌ లో ఉన్నాయి. సంకీర్ణ సర్కార్ కూలిపోయిన తర్వాత బీజేపీ అధికారం చేపట్టి వంద రోజులవుతోంది. బీజేపీ కార్యకర్తలంతా ఆ సంబరాల్లో ఉన్న సమయంలో బయటకొచ్చిన యడ్యూరప్ప వీడియో క్లిప్ కన్నడనాట సంచలనం రేపుతోంది. 


కాంగ్రెస్, జేడీఎస్‌ లకు చెందిన మొత్తం 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సమయంలో,  పార్టీ పెద్దలకు, కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకుండా ముంబైలోని ప్రఖ్యాత హోటళ్లలో ఉన్నారు. రెండు, మూడు నెలల వరకూ ఈ క్యాంప్ నడిచింది. బీజేపీయే రెబల్ ఎమ్మెల్యేలతో ఈ క్యాంప్ నిర్వహించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే  వాటిని కమలనాథులు ఖండించారు. కానీ వారందరినీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యవేక్షణలోనే తాను ముంబైలో ఉంచాననీ... కార్యకర్తలతో యడియూరప్ప చెబుతున్న విషయం ఆ క్లిప్పింగ్ లో స్పష్టంగా వినిపిస్తోంది. ఇది తానో.. మరో రాష్ట్ర నాయకుడో తీసుకున్న నిర్ణయం కాదనీ, అంతా అమిత్ షానే చేశారని కుండబద్దలు కొట్టారు యడ్డీ. ఈ 17 మంది ఎమ్మెల్యేలపై ఆనాటి స్పీకర్ వేటు వేయడంతో ఇందులో 15 స్థానాల్లో డిసెంబర్ ఐదున ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ టికెట్‌ పై పోటీ చేయించేందుకు కమలం పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పరిణామాలపై సీఎం యడియూరప్ప  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కన్నడ నాట ఇప్పుడీ క్లిప్పింగ్ రేపుతున్న రాజకీయ మంటలు అంతా ఇంతా కాదు. దీనిపై కాంగ్రెస్, జేడీఎస్‌ లు బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్నాయి. యడియూరప్ప, అమిత్ షాలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 


అయితే ఈ ఆరోపణలను యడియూరప్ప ఖండించారు. హుబ్లీ నియోజకవర్గం గురించే మాట్లాడాననీ, బాధ్యత గల కార్యకర్తలెవరూ అలా మాట్లాడకూడదని చెప్పానని స్పష్టంచేశారు. 13 నెలలు నిండిన కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే తిరుగుబాటు చేసిన తరువాత ఈ ఏడాది జూలైలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: