ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విప‌క్షాల తీరు చిత్రంగా ఉంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. గత రెండు మూడు రోజులుగా ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయని ఆయ‌న పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబు అయిదేళ్లు సిఎంగా పనిచేసి..సినిమాల్లో పాటలు విన్నట్లు.. 'అ' అంటే అమరావతి అని మాటలు చెప్పారన్నారు. చివరికి ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని ఎక్కడా కనిపించకుండా చేశాడు అని మండిప‌డ్డారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నార‌ని ఆక్షేపించారు. ``చంద్రబాబు సిగ్గు, ఎగ్గు వదిలేశాడు.  అయిదేళ్లు సిఎంగా చేసి రాష్ట్ర రాజధానికి కనీసం అడ్రస్‌ కూడా లేకుండా చేశాడు. 2 నెలల కిందటే రాష్ట్ర రాజధానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెప్పాను...ఏపీ రాజధానికి కనీసం చిరునామా లేకపోవడం సిగ్గు చేటని ప్రశ్నించాను.  రాష్ట్ర ప్రజలకు సొంత రాజధాని లేకుండా చేశారు. దీనిని ప్రశ్నించినందుకు నాపై చంద్రబాబు, ఆయన సహచరులు విమర్శలు చేశారు.  బొత్స ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన మ్యాప్‌లో ఎపి రాజధాని ఎందుకు లేదో సమాధానం చెప్పాలి.`` అని బొత్స డిమాండ్ చేశారు.


చంద్రబాబు తోకలుగా ఉన్న బీజేపీ నేతలు వంత పాడుతున్నారని మంత్రి బొత్స మండిప‌డ్డారు. ``ఆనాడు కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి రాజధానిపై ఎందుకు శ్రద్ద తీసుకోలేదు?  కేంద్రమంత్రిగా సుజనా, సిఎంగా చంద్రబాబు నిర్వాకం వల్లే ఈ పరిస్థితి.. వారి అవినీతి, వ్యక్తిగత పోకడలు... దోపిడీ విధానాల వల్లే... ఏపీ రాజధానికి కనీసం చిరునామా కూడా లేకుండా పోయింది.  రాష్ట్ర రాజధానికి అడ్రస్‌ లేకుండా చేశారు. అవినీతితో రాష్ట్రంలో దోపిడీ జ‌రిగితే...వాటిని ఈ ప్రభుత్వం సరిచేస్తుంటే... తప్పుడు ఆరోపణలు చేస్తారా? - మీ అవకతవక విధానాలు... మీ వైఫల్యాల వల్లే ఈ సమస్యలు. వీటిని బూతద్దంలో చూపి... మాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబులా మేం కూడా దోపిడీ చేయాలా...? ఆలీబాబా నలబై దొంగల్లా మేం కూడా పంచుకుని తినాలా?`` అని నిల‌దీశారు. 


రూ. 2లక్షల కోట్లు విలువైన అమరావతి ఏర్పాటు చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని..బంగారు బాతు అని బాబు చెప్పుకొంటున్న‌ప్ప‌టికీ...కానీ ఇది అడ్రస్‌ లేని బాతు అని బొత్స ఎద్దేవా చేశారు. ``అమరావతి తాత్కాలిక చిరునామా అని చంద్రబాబే చెప్పాడు.  పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదులుకుని చంద్రబాబు పారిపోయి వచ్చాడు.  చంద్రబాబుకు దూరదృష్టి లేకపోవడం... అవినీతికి పాల్పడటం..వల్లే ఈ పరిస్థితి వచ్చింది. రాజధానిపై నిపుణుల కమిటీ రాజధాని విషయంలో అధ్యయనం చేస్తోంది.  ఈ రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమంను సిఎం వైఎస్‌ జగన్ సమన్వయం చేస్తున్నారు.`` అని స్ప‌ష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: