తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబుతో కలిసి ఆయన మిత్రుడు పవన్ క‌ళ్యాణ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేందుకు బయటకు వస్తున్నారని ఏపీ మంత్రి బొత్సా స‌త్య‌నార‌యాణ అన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు సమస్యలపై స్పందించ కుండా వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేస్తున్నార‌ని ఆరోపించారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌...తాము పెట్టిన స్కీంను ప్రభుత్వం తీసేసిందని చంద్రబాబు బాధ అని బొత్స పేర్కొన్నారు. ``ఇసుక దోపిడీకి అవకాశం లేదనే ఆవేదన చంద్రబాబుది. చంద్రబాబు తన భాషను అదుపులో పెట్టుకోవాలి.ఇసుక కొరతకు సిమెంట్ కంపెనీల ముడుపులే కారణమని ఆరోపిస్తున్నారు.  చంద్రబాబు మేధావితనం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇసుక ఆపితే... సిమెంట్ కంపెనీలు ముడుపులు ఇస్తాయని అర్ధం లేని విమర్శలు చేస్తున్నాడు.  ఉచితం పేరుతో టిడిపి కార్యకర్తలను, ప్రజాప్రతినిధులకు ఇసుకను దోచిపెట్టారు. మీ విధానాలను మేం ఎలా అమలు చేస్తాం చంద్రబాబు? సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలంటూ కొత్త నినాదంతో చంద్రబాబు దోపిడీ చేశారు. హుద్ హుద్‌ తుఫాన్ సందర్బంగా ఈ మాటలు చంద్రబాబు చెప్పారు.  మేం ఇసుక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని అనుకోవడం లేదు.  మీ హయాంలో జరిగిన దోపిడీని సరిదిద్దుతున్నాం. భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నాం.  తాత్కాలికంగానే ఈ ఇబ్బందులు ఉన్నాయి.`` అని స్ప‌ష్టం చేశారు. 


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నటుడు కావడంతో రాజకీయాల్లోనూ తన నటన ప్రదర్శిస్తున్నారని బొత్సా ఎద్దేవా చేశారు. ``రాజకీయాల్లో మాటలు కావు.. పని కావాలి. రాజకీయాల్లో 25 సంవత్సరాలు ఉంటానంటూ...25 నెలలకు ఒకసారి బయటకు వస్తున్నారు. వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయంగా మాట్లాడుతున్నారు. సవాళ్లు విసరడం... తాట తీస్తాననడం... పదిమందిని తీసుకువస్తామని చెప్పడం...సరికాదు. చంద్రబాబుకు ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదు... పవన్‌ 25 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. మరో రెండు ఎలక్షన్‌లు పవన్ చూడాల్సి వుంది. ఇప్పటికైనా ఆయన సంయమనంతో మాట్లాడాలి. రాజకీయాల్లో కొన్ని పద్దతులు, మర్యాదలు పాటించాలి. నిజంగా పవన్‌కు ప్రజల్లో అంత శక్తే ఉంటే...గత ఎన్నికల్లో గెలిచేవారు కాదా?` అని సూటిగా ప్ర‌శ్నించారు. 


``వాస్తవాలను అంగీకరించకుండా.... మేమే గొప్ప అనుకుంటే ఎలా పవన్‌...?రాజకీయాల్లో వ్యక్తులు గొప్ప కాదు... ప్రజలకు బాధ్యత వహించాలి. ప్రజల పట్ల పవన్‌ కళ్యాణ్‌ కు ఎక్కడా బాధ్యత లేదు.ఏదో సాధిద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. మూడేళ్ల పాటు టిడిపి, బిజెపి ప్రభుత్వానికి అనుకూలం వుండి తరువాత విభేదించారు. రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై ఒక్కసారి అయినా గొంతెత్తి మాట్లాడారా...? సమస్యలపై మాట్లాడాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు. పవన్‌ గడిచిన అయిదేళ్లలో భవన కార్మికుల గురించి ఒక్కసారైనా మాట్లాడారా...?``అని నిల‌దీశారు.


``ఈ రోజు సమస్య ఉంది... దీనిని అంగీకరిస్తున్నాం..ప్రకృతి వల్ల ఏర్పడిన ఇబ్బంది ఇది. కొద్దిరోజుల్లో దీనిని అధిగమిస్తాం. రాష్ట్రానికి పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అబద్దాలు చెబుతున్నారు. `` విశాఖలో జరిగిన ఎంఓయుల్లో కనీసం పేర్లు కూడా లేని కంపెనీలు వచ్చాయి.  మా ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తోంది. ఈ రాష్ట్రానికి ఏ విధంగాపెట్టుబడులు తీసుకురావాలి...నిరుద్యోగ సమస్యను ఏ రకంగా నిర్మూలించాలో మాకు తెలుసు.భవన నిర్మాణ కార్మికులకు రూ.50వేలు పరిహారం అడుగుతున్నారు. ఇది ఇవ్వగలిగే మొత్తమేనా... గతంలో ఎప్పుడైనా ఇలా ఇచ్చారా?  కార్మికులకు ఉపాధి చూపించేందుకు కొత్త పనులను మంజూరు చేస్తున్నాం. పంచాయతీ రాజ్‌ నుంచి ప్రతి నియోజకవర్గానికి రూ.20 కోట్ల వరకు కేటాయించాం.  నిర్మాణ రంగంలోని వారికి దీనివల్ల ఉపాధి లభిస్తుంది.` అని తెలిపారు.


2014లో తాను ఓటమి పాలయ్యానని, దానిని అంగీకరించానని బొత్సా స్ప‌ష్టం చేశారు. ``తరువాత వైఎస్‌ఆర్ సిపిలో చేరాను. వైఎస్‌ జగన్‌ నాయకత్వం అవసరమని చెప్పాను. ఆనాడు ఉన్న టీడీపీ విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని చెప్పాను. చంద్రబాబు వల్ల రాష్ట్రం అన్యాయమైపోతోందని అన్నాను.  వ్యవస్థలో మార్పు తేవాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమని చెప్పాను.` అని బొత్సా గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: