అబ్దుల్ కలాం పురస్కారాల పేరు మార్పుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కలాం ప్రతిభా పురస్కార్ పేరును వైెె.ఎస్.ఆర్ విద్యా పురస్కార్ గా మారుస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విషయాన్ని తెలుసుకున్న సీఎం జగన్ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. మరికొన్ని అవార్డులకు మహనీయుల పేర్లు పెట్టాలని సూచించారు.  


ఏపీలో విద్యార్ధులకు ఏటా ఇచ్చే అబ్దుల్ కలాం పురస్కారాల పేరు మార్పు ప్రతిపాదన తీవ్ర దుమారాన్ని రేపింది. మిస్సైల్‌ మ్యాన్‌గా ఖ్యాతి గడించిన అబ్దుల్‌ కలాం విషయంలోనూ రివర్సేనా అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేతలు. ప్రతిభా పురస్కారాలకు కలాం పేరు తీసేసి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై ఇదేం పద్దతి అంటూ నారా లోకేష్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వేర్వేరుగా ట్వీట్లు చేశారు. కలాంను అవమానించడానికే పేరు మార్చారని మండిపడ్డారు. ఇలాంటివి జగన్‌కు తెలియకుండానే జరుగుతాయా? అని ప్రశ్నించారు. 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పేరు మార్పు వ్యవహారాన్ని తప్పు పట్టారు. మిస్సైల్ టెక్నాలజీని డెవలప్ చేసిన వ్యక్తి పేరు తొలగించాలన్న ఆలోచన సరికాదన్నారు. జీవోను విడుదల చేసి ప్రజాగ్రహంతో వెనక్కితీసుకోవడమంటేనే పాలనపై పట్టులేదనడానికి ఇదొక నిదర్శమని విమర్శించారు పవన్ కళ్యాణ్. 


ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ తెచ్చిన జీవో రద్దు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకే ఆ జీవోను రివోక్ చేసి, అబ్దుల్ కలామ్ పేరిట అవార్డు కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్‌ కలాం పేరు మార్పుపై  సీఎం జగన్ సీరియస్‌ అయ్యారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవో రద్దు చేయాలని ఆదేశించారు. అబ్దుల్‌ కలాం పేరే పెట్టాలని  స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. కలాంతోపాటు  గాంధీ, అంబేడ్కర్‌, పూలే, జగ్జీవన్‌రామ్‌ వంటి మహనీయుల పేర్లపై కూడా అవార్డులు ఇవ్వాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: