సమ్మె విరమించి భేషరతుగా విధుల్లో చేరేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రి తో ముగియనుంది . ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆశించినట్లు పెద్ద సంఖ్య లో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరలేదు . కేవలం 208 మంది ఇప్పటి వరకు విధుల్లో చేరినట్లు ఆర్టీసీ అధికారులు తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా తెల్సింది . ఇందులో బస్ భవన్ లో విధులు నిర్వహించే ఉద్యోగులే 117  మంది ఉన్నట్లు సమాచారం . అయితే కార్మికులు ఎవరు ప్రభుత్వ బెదిరింపులకు లొంగేది లేదని , విధుల్లో చేరిన వారు కూడా వెనక్కి వస్తున్నారంటూ జెఎసి నేతలు చెబుతున్నారు .


మరొకవైపు ప్రభుత్వం ఇచ్చిన గడువు లోగా విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులు తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకే కాక ఇంకా పలుచోట్ల తమ జాయినింగ్ లెటర్స్ ఇవ్వవచ్చని తెలంగాణ ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఆయా జిల్లాల కలెకర్టర్ కార్యాలయంలో గానీ, ఎస్పీ కార్యాలయంలో గానీ, ఆర్డీవో కార్యాలయంలో గానీ, డిఎస్పీ కార్యాలయంలోగానీ, తాము పనిచేస్తున్న డిపో మేనేజర్ కార్యాలయంలో గానీ, డివిఎం కార్యాలయంలో గానీ,  రీజనల్ మేనేజర్ కార్యాలయంలో గానీ విధుల్లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ ఇవ్వవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


హైదరాబాద్ లో పనిచేసే కార్మికులు బస్ భవన్ లో ఇడి కార్యాలయాల్లో లేఖలు అందించవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు వచ్చిన లేఖలన్నీ హైదరాబాద్ చేరుకుంటాయన్నారు. వాటిని ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని, విధుల్లో చేరే కార్మికులకు అన్ని రకాల రక్షణ కల్పించనున్నట్లు అయన  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: