సోమవారం రోజున అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో పట్టపగలు తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విజయారెడ్డి సజీవ దహనం అవటానికి కారణమైన నిందితుడు సురేశ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 65 శాతం గాయాలవ్వడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్ కేసులో కొత్త విషయాలు తెలుస్తున్నాయి.  
 
సురేశ్ గురించి తెలిసిన వారు సురేశ్ మానసిక పరిస్థితి వింతగా ఉంటుందని చెబుతున్నారు. నిందితుడు సురేశ్ తనకు అనుకూలంగా వ్యవహరిస్తే ఒకలా తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మరోలా ఉంటాడని గౌరెల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వాధికారులతో గతంలో కూడా సురేశ్ గొడవపడ్డాడని చిన్నచిన్న విషయాలకే సురేశ్ రెచ్చిపోయేవాడని గౌరెల్లి గ్రామస్తులు చెబుతున్నారు. 
 
ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు సురేశ్ బైక్ పై ప్రయాణించే సమయంలో సురేశ్ బైక్ ఆపితే బైక్ డాక్యుమెంట్లు అన్నీ చూపించిన తరువాత ట్రాఫిక్ పోలీసులతో నా సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించేవాడని తెలుస్తోంది. గతంలో ఎన్నో సందర్భాల్లో సురేశ్ రెవిన్యూ అధికారులతో గొడవ పడ్డాడు. సురేశ్ అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. 
 
ఈ భూ వివాదంలో అర్థం కాని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. సురేశ్ ను ఎవరో తహశీల్దార్ విజయారెడ్డిని హత్య చేసేలా ఉసిగొల్పారని అందువలనే సురేశ్ ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేశ్ బలహీనత బాగా తెలిసిన ఎవరో సురేశ్ హత్య చేసేలా ప్రేరేపించారనే వార్తలు వినిపిస్తున్నాయి. సురేశ్ ఆస్పత్రిలో చికిత్సకు కోలుకొని పోలీసుల విచారణలో నిజాలు చెబితే మాత్రమే ఈ కేసులో చిక్కుముడులు వీడే అవకాశం ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న సురేశ్ పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. మరో 72 గంటలు గడిస్తే మాత్రమే ఏ విషయమైనా చెప్పగలమని వైద్యులు చెబుతున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: