తెలంగాణా ఆర్టీసీలో మంగళవారం టెన్షన్ పెరిగిపోతోంది. సమ్మెలో ఉన్న వేలాదిమంది సిబ్బంది  ఉద్యోగాల్లో చేరటానికి కేసీయార్ ఇచ్చిన గడువు ఈరోజు అంటే 5వ తేదీ అర్ధరాత్రితో పూర్తవుతోంది. దాంతో కార్మికులు, ఉద్యోగులు ఏం చేస్తారు అన్న విషయంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబడుతుంటే మరోవైపు కేసియార్ ఏమో ఎట్టి పరిస్ధితుల్లోను సాధ్యం కాదని తేల్చేశారు.

 

కేసీయార్ ఎప్పుడైతే తన వైఖరికే కట్టుబడి కార్మిక నేతలను లెక్క చేయలేదో అప్పటి నుండే కార్మిక నేతలు కూడా తమ డిమాండ్ పై గట్టిగా నిలబడ్డారు.  దాంతో సమ్మె విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఫలితంగా 33 రోజులుగా నిరవదిక సమ్మె కంటిన్యు అవుతునే ఉంది.

 

సమ్మె విరమించే విషయంలో కోర్టు జోక్యం చేసుకున్నా కేసీయార్ పట్టించుకోలేదు. పైగా నాలుగు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ 5వ తేదీ అర్ధరాత్రిలోగా ఉద్యోగాల్లో చేరకపోతే మొత్తం 43 వేలమందిని ఉద్యోగాల్లో నుండి తొలగించేస్తామని మళ్ళీ బెదిరించారు. దాంతో ఉద్యోగులు, కార్మికులందరూ ఎదురుతిరిగారు. విధుల్లో చేరేది లేదని తెగేసి చెప్పారు. ఏం చేసుకుంటావో చేసుకోమంటు సవాలు విసిరారు.

 

అయితే తెలంగాణా వ్యాప్తంగా గడచిన మూడు రోజుల్లో 200 మంది సిబ్బంది విధుల్లో చేరినట్లు సమాచారం. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న వారిలో కొందరు మాత్రమే విధుల్లో చేరారట. అందులో కూడా మళ్ళీ కొందరు సంతకాలు పెట్టేసి సమ్మెలోకి వెళిపోయారట.

 

సంస్దలో 43 వేలమంది సిబ్బంది ఉంటే చేరిన వాళ్ళ సంఖ్య 200 అంటే కేసియార్ వార్నింగులకు వీళ్ళు ఏపాటి విలువ ఇచ్చారో అర్ధమైపోతోంది. వేలాదిమందిని ఉద్యోగాల్లో నుండి తీసేయటానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసుకుంటోంది. అదే సమయంలో  ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయటానికి ఉద్యోగ సంఘాల నేతలు రెడీ అవుతున్నారు. పైగా సమ్మెను మరింత ఉధృతం చేయటానికి వ్యూహాలు రెడీ చేసుకుంటుడటంతో మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఏమవుతుందో అనే టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: