బెంగళూరులో నివశించే మెహక్ వీ పిరాగిల్ అనే ధనవంతుడి ఇంట్లో కొన్ని రోజుల క్రితం కుశాల్ సింగ్ అనే వ్యక్తి పనిలో చేరాడు. పిరాగిల్ స్నేహితుడు కుశాల్ ను పనిలో చేర్చుకోమని కోరగా పిరాగిల్ ఆ వ్యక్తిని పనిలో చేర్చుకున్నాడు. కుశాల్ ను ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పిరాగిల్ షాపు పని మీద బయటకు వెళ్లాడు. పని ముగించుకొని ఇంటికి వచ్చిన పిరాగిల్ ఇళ్లంతా చిందరవందరగా ఉండటంతో షాక్ కు గురయ్యాడు. 
 
ఇంట్లోని బంగారు నగలు కూడా పిరాగిల్ కు కనిపించలేదు. పని చేసే కుశాల్ కోసం ఇళ్లంతా వెతికినా ఫలితం లేకుండా పోవటంతో పిరాగిల్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా కుశాల్ రైలులో గుజరాత్ రాష్ట్రంలోని అజ్మీర్ కు వెళ్తున్నట్లు గుర్తించారు. మొబైల్ నంబర్ ద్వారా కుశాల్ ను ట్రాక్ చేసిన పోలీసులు విమానంలో అజ్మీర్ కు కుశాల్ సింగ్ కంటే ముందుగా చేరుకున్నారు. 
 
కుశాల్ మూడు రోజులు తాపీగా ప్రయాణం చేసి సొంతూరికి చేరుకోగా పోలీసులు కుశాల్ ను పట్టుకున్నారు. కుశాల్ దగ్గరనుండి పోలీసులు దొంగలించిన బంగారాన్ని రికవరీ చేశారు. బెంగళూరు నుండి బయలుదేరిన కుశాల్ అజ్మీర్ వెళితే తనను ఎవరూ పట్టుకోలేరని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా పోలీసులు  షాక్  ఇవ్వటంతో షాక్ అవ్వడం కుశాల్ వంతయింది. 
 
పోలీసులు నిందితుడు కుశాల్ ను తీసుకొని బెంగళూరుకు వచ్చారు. తక్కువ సమయంలో ధనవంతుడు కావాలనే ఆశతో కుశాల్ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సకాలంలో స్పందించటంతో నిందితుడు కుశాల్ దగ్గర నుండి పూర్తి నగలను స్వాధీనం చేసుకోవటానికి వీలైంది. కుశాల్ నగలను అమ్మాలని ప్రయత్నించినా కుదరలేదని తెలుస్తోంది. గతంలో కుశాల్ పై ఎటువంటి కేసు నమోదు కాలేదని పోలీసులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: