ఈనెల 2వ తేదీన తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. లాయర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వారు విధ్వంసానికి దిగారు. వాహనాలను తగులబెట్టారు. సోమవారం వివాదం మరింత ముదిరింది. ఓ పోలీసుపై న్యాయవాదులు దాడికి పాల్పడ్డారు. సాకేత్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ బయట తన బైక్‌ వద్ద నిలబడి ఉన్న కానిస్టేబుల్‌ను ఆరుగురు న్యాయవాదుల బృందం చుట్టుముట్టింది. ఒక న్యాయవాది ఆ కానిస్టేబుల్ మీదకు దూసుకెళ్లి మోచేతితో వీపుపై కొట్టాడు. అతని చెంపలు వాయించి నెట్టివేశాడు. ఇది పోలీసులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.


ఇదిలా ఉంటే, తీస్ హజారీ కోర్టు ఘటనను ఢిల్లీ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. స్పెషల్ కమిషనర్ సంజయ్ సింగ్‌‌ను సస్పెండ్ చేయడంతో పాటు పలువురు పోలీసు అధికారులకు చర్యలకు ఆదేశించింది. ఘర్షణల నేపథ్యంలో తీస్ హజారీ, కార్కర్‌డూమ జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి.


 ఢిల్లీలో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చింది. పోలీసు కానిస్టేబుల్‌పై న్యాయవాదుల దాడిని నిరసిస్తూ ఢిల్లీలోని ఐటీఓలో ఉన్న పోలీసులు నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నినదాలు చేశారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించే తమకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించేవరకు వెనక్కి తగ్గేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. 


దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసుల ఆందోళనల నేపథ్యంలో పోలీసు కమిషనర్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను కలిశారు. తాజా పరిణామాలను ఆయనకు వివరించారు. కేంద్ర హోంశాఖ కూడా ఈ ఘటనలపై దృష్టి సారిం చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: