అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన నిందితుడు సురేష్ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నదని ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి . విజయారెడ్డి పై పెట్రోలు పోయడానికి ముందే, తనపై పెట్రోలు పోసుకుని ఆమెను బెదిరించే ప్రయత్నం చేసిన సురేష్ , తన ప్రయత్నం విఫలం కావడంతో విజయారెడ్డి పై కూడా పెట్రోలు పోసి నిప్పంటించినట్లు తన వాంగ్మూలం లో సురేష్ వెల్లడించాడు .


 విజయారెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా , సురేష్ 65  శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రి లోని మెయిల్ బర్నింగ్ వార్డు లో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల పర్యవేక్షణ లో చికిత్స పొందుతున్నాడు . విజయారెడ్డి ని కాపాడే యత్నం లో కాలిగాయపడిన డ్రైవర్ గురునాధం చికిత్స పొందుతూ మృతి చెందాడు . ఇదే ఘటన లో  గాయపడిన అటెండర్  చికిత్స పొందుతున్నాడు . ఇక సురేష్ పరిస్థితి విషమించడంతో 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏమి చెప్పలేమని వైద్యులు తెలిపారు . సురేష్ చేతిలో దారుణ హత్యకు గురైన విజయారెడ్డి అంత్యక్రియలు రెవిన్యూ ఉద్యోగ సహచరులు , కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్ శ్మశానవాటిక లో పూర్తయ్యాయి .


దారి పొడువునా  రెవిన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు . ఒక దశలో రోడ్డు పై బైఠాయించేందుకు రెవిన్యూ ఉద్యోగులు ప్రయత్నించగా , స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది .   విజయారెడ్డి చితికి ఆమె భర్త సుభాష్ రెడ్డి నిప్పంటించారు . విజయారెడ్డి సజీవ దహన ఘటన ను నిరసిస్తూ మరో రెండు రోజులపాటు రెవిన్యూ ఉద్యోగులు నిరసన గా విధులను బహిష్కరించాలని నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: