మహానగరాల్లో రహదారులు అద్దాల్లా మెరుస్తూ ఉంటాయి.. పట్టణాల్లోనూ రహదారి సౌకర్యాలు బాగానే ఉంటాయి. మండల కేంద్రాల్లో ఓ మాదిరిగా ఉంటాయి. ఇక పల్లెటూళ్లలో మాత్రం దారి కష్టాలు మామూలుగా ఉండవు. ఇక ఏజెన్సీల సంగతి చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇక సింగిల్ రోడ్డు నిర్మాణం అన్నదే ఉండొద్దని అధికారులను ఆదేశించారు.


ఇక ఏపీలో వేసే రోడ్లన్నీ డబుల్ లైన్ వే అన్నమాట. ఈ నిర్ణయం ప్రత్యేకించి పల్లెటూళ్లకు చాలా మేలు చేసే నిర్ణయం. దీన్ని సరిగ్గా అమలు చేస్తే పల్లెవాసుల రవాణా కష్టాలు చాలావరకూ తీరతాయి. అంతే కాదు.. రహదారుల నిర్మాణాల్లోనూ రివర్స్ టెండరింగ్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దెబ్బతిన్న రహదారుల నిర్మాణానికి తక్షణం రూ.625 కోట్లు వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు.


అమరావతి - అనంతపురం ఎక్స్ ప్రెస్ వే పనులకు భూసేకరణకు లైన్ క్లియర్ చేసారు. 676 శిథిలమైన వంతెనల స్థానంలో కొత్త వంతెనల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.6,400 కోట్లు ఖర్చుకానుంది. గత ప్రభుత్వ హయాంలో మూడున్నరేళ్లకు కూడా పూర్తి కాని దుర్గ గుడి వంతెనను జనవరికల్లా పూర్తి చేస్తామని అధికారులు సీఎం గారికి తెలిపారు. అత్యుత్తమ ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం, నిర్వాహణ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.


జిల్లా రహదారులు, మండలాలను కలిపే రోడ్లను వేగంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రహదారుల నిర్మాణమే కాదు ప్రజా రవాణా - సురక్షితమైన ప్రయాణాల విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటున్నారు. 12లక్షల కి.మీకుపైగా తిరిగిన కాలం చెల్లిన 3,600 బస్సులను వెంటనే మార్చాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీఆర్డీసీ బలోపేతం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటుకు అంగీకారం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: