తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరికలపై విధించిన గడువు ముగిసింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 360 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు లేఖలిచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జోన్ లో 31 మంది, గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో 62 మంది, బస్ భవన్ లోని పరిపాలన సిబ్బంది 200 మంది మిగిలిన వారు ఇతర డిపోల పరిధిలో చేరేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ముగియటంతో ఆర్టీసీ ప్రైవేట్ పరం కాబోతుందా? మిగిలిన 5,000 బస్సుల స్థానంలో ప్రభుత్వం ప్రైవేటుకు పర్మిట్లు ఇచ్చేస్తుందా..? న్యాయ వివాదాల్లో ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు చిక్కుకున్నట్లేనా...? అనే ప్రశ్నలకు సమాధానాలు అవుననే వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఒకటి రెండు రోజుల్లో ప్రైవేట్ పర్మిట్లు జారీ చేయటానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాడని సమాచారం. 
 
సీఎం కేసీఆర్ తన వైఖరికే కట్టుబడి ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇచ్చి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయనున్నాడని సమాచారం. డెడ్ లైన్ ఇచ్చినప్పటికీ ఊహించిన స్థాయిలో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోవటంతో సీఎం కేసీఆర్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటివరకూ విధుల్లో చేరినవారికి ఎక్కడా డ్యూటీలు ఇవ్వలేదని తెలుస్తోంది. 
 
రేపు హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే మాత్రం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం రేపు కోర్టు తీర్పు తరువాత విధుల్లో చేరినవారికి డ్యూటీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ఒప్పుకుంటే మిగతా ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. అందువలన ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాత్రం ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం, రాష్ట్రం వాటా 69 శాతం ఉందని ఎలాంటి మార్పులైనా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని చెప్పటం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: