రాజకీయ నాయకులూ  తలుచుకుంటే   ఏం అయినా చేస్తారు అని మరో సారి రుజువు చేసింది ఈ మహిళ .ప్రభుత్వ పింఛన్ డబ్బుల కోసం ఓ మహిళ నాయకురాలు దారుణానికి పాల్పడింది. భర్త బతికుండగానే నకిలీ సర్టిఫికెట్ సమర్పించి వితంతు పింఛన్ పొందుతోంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఈ ఘటన బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కుభీర్ మండలం సిర్పెల్లి ఎంపీటీసీ సభ్యురాలు రాథోడ్ బిజ్జూబాయి వితంతు పింఛన్ డబ్బుల కోసం అక్రమానికి తెరతీశారు.

అధికారులను తప్పుదోవ పట్టించి, నకిలీ మరణ ధ్రువపత్రం సమర్పించి నాలుగేళ్లుగా అక్రమంగా వితంతు పింఛన్‌ పొందుతున్నారు.బిజ్జుబాయిని ఎంపీటీసీ పదవి నుంచి తొలగించాలని మాజీ సర్పంచి గోపీచంద్‌, గ్రామస్థులు ఆడే బిక్కు, ఆడే గబ్బు, పండిత్ తదితరులు డిమాండ్‌ చేశారు. సోమవారం సిర్పెల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వివిధ వర్గాల వారికి అందిస్తున్న పింఛన్‌ డబ్బులపై కన్నేసిన ఆ ప్రజా ప్రతినిధి భర్త బతికుండానే వితంతువుగా మారిందని ఆరోపించారు.


అర్హత లేకున్నా బిజ్జూబాయి అయిదేళ్లుగా నెల నెలా పింఛన్‌ పొందుతూ ప్రభుత్వ ఖజానాకు రూ.1.11 లక్షలు గండికొట్టారని గ్రామస్థులు మండిపడ్డారు. 2015 మార్చి 19న ఆమెకు ప్రభుత్వం నుంచి మొదటిసారిగా పింఛన్‌ మంజూరైందని తెలిపారు. 2019 సెప్టెంబర్ వరకు పింఛన్ డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు చూపారు.


ఎంపీటీసీ బిజ్జూబాయిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు  డిమాండ్ చేశారు. ఆమె అక్రమంగా పొందిన పింఛన్ రికవరీ చేయాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్ సహా జిల్లా పాలనాధికారి, తహశీల్డార్‌, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఎంపీడీవో సుముఖం శేఖర్‌ ఘటనపై స్పందిస్తూ ఆమెకు ఇచ్చిన పింఛన్‌ ఐడీ ద్వారా గ్రామంలో విచారణ చేపట్టి పై అధికారులకు నివేదిస్తామని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: