ఎన్నో ఆశ‌ల‌తో టీ కాంగ్రెస్‌కు భ‌విష్య‌త్ ఆశాకిర‌ణంగాను, త‌న‌కు తాను తెలంగాణ భ‌విష్య‌త్తు లీడ‌ర్‌గాను ఊహించుకుంటోన్న మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. టీడీపీ నుంచి రేవంత్ ఎన్నో ఆశ‌ల‌తో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ‌త యేడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కొడంగ‌ల్‌లోనే ఆయ‌న ఓడిపోయారు. ఇక రేవంత్ ప‌ని అయిపోయింద‌నుకున్న టైంలో ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి మ‌రి మ‌ల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు.


మంచి వాయిస్ ఉన్న నేత కావ‌డంతో కాంగ్రెస్‌లో కూడా రేవంత్ త‌క్క‌వ టైంలోనే కీల‌క నేత‌గా ఎదిగారు. అక్క‌డ అధిష్టానం కూడా మంచి ప్ర‌యార్టీ ఇచ్చింది. ఇటు తెలంగాణ ప్ర‌జ‌లు కూడా రేవంత్‌ను ఓ ఫైర్‌బ్రాండ్‌డానే గుర్తిస్తున్నారు. అయితే ఎక్క‌డొచ్చి టీ కాంగ్రెస్‌లో ఉన్న పెద్ద త‌ల‌కాయ‌లు మాత్రం రేవంత్ ఎదుగుద‌ల‌ను జీర్ణించుకోలేక‌పోతున్నారు.


రేవంత్ టాలెంట్ చూసి కాంగ్రెస్ అధిష్టానం ఆయ‌న‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని కూడా క‌ట్ట‌బెట్టింది. దీంతో ఇక త‌న‌కు తిరుగులేద‌ని రేవంత్‌రెడ్డి అనుకున్నారు. అదే క్ర‌మంలో మ‌రో ప‌ద‌విపై కూడా  ఆయ‌న క‌న్నేశారు. టీ పీసీసీ ప‌ద‌విపై ఆశ‌తో ఉన్న రేవంత్‌కు ఆ పార్టీ కీల‌క నేత‌లు అంద‌రూ అడుగ‌డుగునా అడ్డు త‌గులుతున్నారు. ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డి, వి.హ‌నుమంత‌రావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేత‌లు రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారు.


హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లకు ముందు అభ్య‌ర్థి విష‌యంలో రేవంత్‌రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిల మ‌ధ్య నెల‌కొన్న రాద్ధాంతం అంద‌రికీ తెలిసిందే. తాజాగా గులా నబీ ఆజాద్ స‌మ‌క్షంలో గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో రేవంత్‌రెడ్డికి ష‌బ్బీర్ అలీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని వీహెచ్ మండిప‌డ్డారు. ఇక త‌న‌కే టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వాల‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ముందుకొచ్చారు. అస‌లు ఉత్త‌మ్‌ను త‌ప్పిస్తారా ?  లేదా ? అన్న‌ది క్లారిటీ లేదు.


మ‌రోవైపు ఈ నేత‌లు ఒక‌రికొక‌రు త‌మ‌లో తామే క‌ల‌హించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో టీ కాంగ్రెస్ నేత‌ల వార్ చూస్తుంటే వీళ్లంద‌రు క‌లిసి రేవంత్‌ను ఎంత మాత్రం ఎద‌గ‌నిచ్చే ప‌రిస్థితి లేద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి నేరుగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌పై ప్ర‌త్యేక‌మైన ప్రేమ చూపిస్తే త‌ప్పా ఇక్క‌డ టీ కాంగ్రెస్ నేత‌ల‌ను రేవంత్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.



మరింత సమాచారం తెలుసుకోండి: