ఆర్టీసీ కార్మికులకు.. ప్రభుత్వానికి మధ్య గత 33 రోజులుగా పోరాటం జరుగుతున్నది.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, విలీనంతో పాటుగా తమ 26 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ యాజమాన్యానికి గతంలో నోటీసులు ఇచ్చారు. కానీ, ఆ నోటీసులపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోలేదు.  దీంతో సెప్టెంబర్ 5 వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి దిగారు.  సమ్మెలోకి దిగి నేటికీ 33 రోజులు అయ్యింది.  కార్మికులు పట్టువదలడం లేదు... ప్రభుత్వం దిగిరావడం లేదు.  


మొక్కుబడిగా ఓసారి కార్మికులను చర్చలకు పిలిచింది.  పిలవాలి కాబట్టి పిలుస్తున్నట్టు చెప్పింది.  21 డిమాండ్లపై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం రెంటింటిపై మాత్రమే చర్చిస్తామని, రెండు డిమాండ్లు మాత్రమే పరిష్కరిస్తామని చెప్పడంతో వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది.  ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించకపోగా, ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అయినట్టుగా ప్రకటించింది.  ప్రైవేట్ కార్మికులను తీసుకొని బస్సులు నడపాలని చూసింది.  


కానీ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వర్కౌట్ కాలేదు.  బస్సులు బయటకు వచ్చినా అవి ఎక్కడో ఒకచోట ఆగిపోతున్నాయి.  ప్రైవేట్ వ్యక్తులకు బస్సులు అప్పగిస్తే ఎలా ఉంటుందో ఆర్టీసీ యాజమాన్యానికి అర్ధం అయ్యింది.  అందుకే ప్రభుత్వం మరోసారి కార్మికులకు డెడ్ లైన్ విధించింది.  మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లోకి రావాలని చెప్పింది.  అలా రాకుంటే ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం అని హెచ్చరించింది.  


ఉద్యోగాలు లేకుంటే బతుకు కష్టం అవుతుందని భావించిన కొందరు ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధం అయ్యారు.  హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్ భవన్ లో 209 మంది కార్మికులు జాయిన్ రిపోర్ట్ ఇచ్చారు.  ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు భద్రతా ఇస్తామని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నది.  మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా క్లోజ్ చేసి, దాని స్థానంలో కొత్త సంస్థను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నది.  మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: