మూడు రోజుల సొంత జిల్లా చిత్తూరు పర్యటనలో చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. అధికారంలో ఉన్నంత వరకూ చాలామంది నేతలను దూరంగా పెట్టేసిన ఫలితంగా నేతల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది. దాని ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టిడిపి గెలిచింది కేవలం ఒకే ఒక స్ధానం. ఆ ఒక్కటి కూడా చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కావటం గమనార్హం.

 

ఇచ్చిన హమీలను పక్కనపడేయటం, నేతల్లో చాలామందిని దూరంగా నిలబెట్టేయటం, కష్టపడిన వారిని గుర్తించకపోవటం లాంటి అనేక అవలక్షణాల వల్ల చంద్రబాబుపై  జిల్లా పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది. ఇవన్నీ ఇలా ఉండగానే వైసిపి తరపున గెలిచిన అమరనాధరెడ్డిని టిడిపిలోకి ఫిరాయించేట్లు ప్రోత్సహించి మంత్రిని కూడా చేశారు. దాంతో  అసంతృప్తి పీక్స్ కు చేరుకునేసింది.

 

అంత అసంతృప్తి ఎందుకు పెరిగిపోయిందంటే ఫిరాయింపు మంత్రి కేవలం తన వర్గం వాళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేయటం వల్ల. అంటే మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను చంద్రబాబు గుర్తించలేదు. ఫిరాయింపు మంత్రి కేవలం తన వర్గం నేతల  ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు. దాంతో చాలామంది నేతలు ఎటూ కాకుండా పోయారు.

 

తమ సమస్యలను ఎన్నిసార్లు  చెప్పుకున్నా  చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. పోనీ లోకేష్ చెప్పుకుందామంటే ఆయన కూడా ఎవరినీ దగ్గరకు చేరనీయలేదు. దాంతో అందరికీ మండిపోయింది. సరే మొత్తానికి అందరూ ఊహించినట్లుగానే టిడిపి ఘోరంగా ఓడిపోయింది. ఎప్పుడైతే పార్టీ ఘోరంగా దెబ్బతిన్నదో వెంటనే చంద్రబాబుకు పార్టీ నేతలు గుర్తుకు వచ్చేశారు.

 

రాష్ట్రమంతా తిరుగుతున్నట్లే చిత్తూరు జిల్లాలో కూడా  మూడు రోజుల పర్యటన పెట్టుకున్నారు. రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో నేతలందరినీ పనిచేయించేట్లు ఒప్పించటానికే నియోజకవర్గాల సమీక్షలను పెట్టుకున్నారు. అధికారంలో ఉన్నపుడు పార్టీలో తమకు ఎదురైన అవమానాలను నేతలెవరూ మరచిపోలేదట. ఈ విషయంలోనే నేతల్లో చాలామంది చంద్రబాబుకు షాక్ ఇవ్వటం ఖాయమని పార్టీ నేతలే చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: