దేశవ్యాప్తంగా మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. మమ్మల్ని కోస్తేనే కాదు ఇప్పుడు చూస్తేనే  మీకు కన్నీళ్లు వస్తాయని ఛాలెంజ్ చేసిన్నట్లుగా ఉంది ఉల్లి ధరల పరిస్దితి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యుల కంట రక్త కన్నీరు సినిమా చూపిస్తున్న ఉల్లిని చూస్తే మధ్యతరగతి మానవుడు ఆమడ దూరం పరిగెడుతున్నాడు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఉల్లి ధర దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రూ.90 నుంచి రూ.100 పలుకుతోంది.


దీంతో జనం ఉల్లిపాయలు కొనాలంటేనే భయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో అకాల వర్షాలకు ఉల్లి పంట దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టాన్ని కల్గించాయి. నాసిక్‌, అహ్మద్‌నగర్‌, పుణెలలోనూ పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఉల్లి ఒక్కసారిగా హైస్పీడ్ రేంజ్ లో పరిగెత్తడం మొదలెట్టింది. ఇక అక్టోబరులో ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ పెరగుతుండటం వినియోగదారులపై భారం పడుతోంది.


ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రూ.100 మార్క్‌కు చేరువుగా ఉంది. దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ ఉల్లి మార్కెట్‌ లాసాల్‌గావ్‌లో కిలో రూ.55.50 పలుకుతోంది. ఇటు, హైదరాబాద్‌లో కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80గా ఉండగా. మంగళవారం హైదరాబాద్‌లో నాణ్యమైన మహారాష్ట్ర గ్రేడ్-1 ఉల్లి హోల్‌సేల్ ధర కిలో రూ.60, రెండో రకం కిలో రూ.50, మూడో రకం రూ.40 పలికింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఉల్లి గ్రేడ్-1 రూ.50, గ్రేడ్-2 రూ.40లకు చేరింది. రిటెయిల్ మార్కెట్‌లో ఇది రూ.70 నుంచి 80గా ఉంది.


అటు ఆంధప్రదేశ్‌లోనూ ఉల్లి ధరలు రూ.50 నుంచి రూ.70 మధ్య పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లిని విదేశాల నుంచి దిగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇరాన్, ఈజిప్ట్, టర్కీ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటామని ఢిల్లీలోని వినియోగదారుల వ్యవహరాల విభాగం తెలిపింది. ఇకపోతే ఉల్లిని సాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల  పంట నష్టానికి గురికావడంతో దిగుబడి తగ్గి, ధరలు అమాంతం పెరిగిపోయాయని మార్కెట్ వర్గాలవారు పేర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: