దేశంపై మరో రెండు తుపానులు దండెత్తబోతున్నాయ్. బంగాళాఖాతంలో బుల్ బుల్ తుపాను ఈ రోజు బెంగాల్ పై పంజా విసరనుంది. అటు...మహా తుపాను గుజరాత్...మహారాష్ట్రలను తెగ వణికిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఇప్పటికే భీకరమైన గాలులు వీస్తున్నాయ్. దీంతో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయ్. 


బంగాళాఖాతంలో బుల్‌బుల్‌ తుపాన్‌ 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారి బెంగాల్‌ వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.  ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌ వద్ద  వాయుగుండం కేంద్రీకృతం అయింది. ఈ నెల 8 నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. దీని ప్రభావం వల్ల ఈ రోజు, రేపు అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో, ఈ నెల 9న ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ భారీ వర్షాలతో సతమతమవుతున్న దేశ ప్రజలకు మరోమారు ఈ తుఫానుతో ఇబ్బందులు తప్పేట్లు లేవు.


మరోవైపు...మహా తుఫాన్ ముంచుకొస్తోంది. భారీ వర్షాలు, భీకరమైన గాలులతో విరుచుకుపడనుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ మహా... ఈ రాత్రికి గానీ లేదా రేపు ఉదయానికి గానీ గుజరాత్ తీరం  తాకే అవకాశం ఉంది. దియు- పోరుబందర్ మధ్య తీరం తాకనుంది మహా తుపాను. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌లలో భారీ వర్షాలు పడనున్నాయి. వంద నుంచి నూటపది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


మహా ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో అలలు ప్రమాదకరరీతిలో ఎగిసిపడనున్నాయి. నేటి నుంచి తీరప్రాంతంపై మహా ప్రభావం చూపనుంది. ముంచుకొస్తున్న మహా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని  కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు సూచించింది. రెండు రాష్ట్రాల్లోనూ, జాతీయ విపత్తు నిర్వహణా కమిటీతోనూ కేంద్రం చర్చించింది. తుఫాన్ అనంతర పరిస్థితి ఎదుర్కొనేందుకు తీరరక్షక దళం, నావికాదళం సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.


గుజరాత్‌పై మహా...తీవ్ర ప్రభావం చూపనుంది. జునాగర్, అమ్రేలీ, భావనగర్, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్, పోర్ బందర్, రాజ్‌కోట్, వడోదరల్లో ఇవాళ రేపు అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబైపై మహా తుపాన్‌ పెను ప్రభావమే చూపనుంది. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. థానే, పాల్ఘార్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: