మ‌హా రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. పొత్తు పెట్టుకొని బ‌రిలో దిగి...ప్ర‌భుత్వం ఏర్పాటులో క‌త్తులు దూసుకుంటున్న బీజేపీ-శివ‌సేన తీరుతో...ఊహించ‌ని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనను తెరదించేందుకు ఆర్ఎస్ఎస్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్త‌లు సంచ‌ల‌నాన్ని క‌లిగించాయి. ఇదే స‌మ‌యంలో...తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శివసేన మరోసారి స్పష్టం చేస్తోంది. తదుపరి ముఖ్యమంత్రి శివసైనికుడేనని న్యాయం కోసం తాము జరిపే పోరాటంలో విజయం తమదేనని ఆ పార్టీ ఎంపీ, సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీ మద్దతు కూడగట్టేందుకు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ను కలిసిన ఆయన.. పలు కీలక విషయాలపై చర్చించారు.మ‌హారాష్ర్ట ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పవార్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. మహారాష్ట్ర సీఎం రేసులో శరద్‌ పవార్‌ లేరని, శివసేన నేతే సీఎం పగ్గాలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.


అయితే, ఈ స‌మావేశం, ప్ర‌భుత్వ ఏర్పాటు వార్త‌ల నేప‌థ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. తాము శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలేదని స్పష్టం చేశారు. బీజేపీ-శివసేన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.బీజేపీ-శివసేన పార్టీ గత 25 ఏళ్లుగా పరస్పరం మద్ధతు ఇచ్చుకుంటాయన్న పవార్..చివరి క్షణంలోనైన రెండు పార్టీలు ఏకతాటిపైకి వస్తాయ‌ని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షపాత్ర పోషిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నిరోధించాలంటే..బీజేపీ-శివసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. 


మ‌రోవైపు, కాంగ్రెస్ నేత సోనియాగాంధీ న‌మ్మిన‌బంటు అయిన అహ్మ‌ద్ ప‌టేల్‌..కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో స‌మావేశం అయ్యారు. దీంతో మహారాష్ట్రలో స‌ర్కారు ఏర్పాటులో ఏం జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే, రైతుల స‌మ‌స్య‌ను తెలియ‌జేసేందుకే..తాను స‌మావేశం అయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: