నగరంలో జరుగుతున్న సమ్మెవల్ల సగటు మనిషి అష్టకష్టాలు పడి ప్రయాణాలు కొనసాగించవలసిన దుస్దితి కొనసాగుతుంది. ఇకపోతే అరకొరగా నడుస్తున్న బస్సులు ప్రధాన మార్గాలకే పరిమితమయ్యాయి. ఈ సందట్లో సడేమియాలా కొందరు తాత్కాలిక కండక్టర్లు నగర ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇక సమ్మె 33వ రోజుకు చేరినప్పటికీ పూర్తిస్థాయిలో బస్సుల సంఖ్యను పెంచటంలో ప్రభుత్వం విఫలమైంది. ఇకపోతే సమ్మె నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేట్‌ ట్రావెల్స్‌, ప్రైవేటు వాహనాల యజమానులు డబుల్‌, ట్రిబుల్‌ రేట్లు పెంచి ప్రజల నుంచి పైసలు గుంజుతున్నారు. 


ప్రభుత్వం నియమించిన తాత్కాలిక కండక్టర్లలో కొందరు అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో టికెట్‌ చెకింగ్‌ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించి, టికెట్‌ తీసుకోని వారిపై కొరడా ఝుళిపించేవారు. కానీ ప్రస్తుతం సమ్మె నేపథ్యంలో వీరెవరూ అందుబాటులో లేరు. దీంతో తాత్కాలిక కండక్టర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, టికెట్​ కూడా ఇవ్వడం లేదని, ప్రశ్నిస్తే దిగిపొమ్మంటున్నారని, అడ్డగోలుగా జనాల నుంచి డబ్బులు పిండుకుంటూ దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు కొకొల్లలుగా కనిపిస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా అవి సరిపోవడం లేదని, కొందరు ప్రైవేట్ డ్రైవర్లైతే బస్‌ల బ్యాటరీలను, టైర్లను సైతం మారుస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇకపోతే తాత్కాలిక సిబ్బంది చేతివాటం ఆ శాఖపై చెరగని ముద్ర వేస్తోంది. అందివచ్చిన అవకాశం అనుకుంటున్నారో ఏమో గానీ ప్రయాణీకుల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తున్నారు. ఆ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.


సమ్మె కారణంగా రోజువారీ వేతనాలతో టెంపరరీ డ్యూటీలు చేస్తున్న కండక్టర్లు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టికెట్లు ఇచ్చే యంత్రాలు లేకపోవడంతో ఛార్జీలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. దాంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల గొడవలకు కూడా దారి తీసిన సందర్భాలున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం టికెట్లు ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు.


ఆర్టీసీ అధికారులకు అప్పజెప్పాల్సిన మొత్తంలో కూడా అంతో ఇంతో నొక్కేస్తున్నారు. దీనిపై ఆయా రూట్లలో ఎంత వసూలు అయిందనే విషయంలో అధికారులకు కూడా క్లారిటీ లేకుండా పోతోంది. ఈ పరిస్దితుల్లో తెలంగాణ ప్రభుత్వం బస్సులను నడిపి ఉపయోగమేముంది. ఆ సంస్దకు నష్టం తప్పా లాభం అంటూ మిగలదు. ఒకరకంగా పైవేట్ వ్యక్తులతో సంస్దను నడపడం అంటే దోపిడీకి దారులు తెరచినట్లేనని తెలంగాణ ప్రజలు వాపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: