రమణ దీక్షితులు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో మళ్లీ విధుల్లో చేరబోతున్నారు. ఆగమ సలహా మండలి సభ్యుడిగా ఆయన్ని టీటీడీ తిరిగి నియమించింది. దీంతో ఆయన శ్రీవారి ఆలయంలో అడుగుపెట్టనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పునఃప్రవేశానికి మార్గం సుగమం చేసింది టీటీడీ. సీఎం జగన్ ఆదేశాల మేరకు మీరాశి అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వం ఇచ్చేందుకు టీటీడీ పాలకమండలి అంగీకరించింది. దీంతో రమణ దీక్షితులుతో పాటు రిటైర్ అయిన అర్చకులకు శ్రీవారి ఆలయ ప్రవేశం లభించనుంది. రమణ దీక్షితులును ఆగమ సలహామండలి సభ్యుడిగా నియమించడంతో పాటు నూతన అర్చకులకు శిక్షణ ఇప్పించే బాధ్యతను అప్పగించింది. దీనికి సంబంధించిన ఆర్డర్‌ కాపీని కూడా విడుదల చేసింది.  ప్రస్తుతం రమణ దీక్షితులు తొలగింపు అంశం కోర్టులో ఉంది. కోర్టులో కేసు పూర్తయిన తరువాతే అర్చకత్వ బాధ్యతలను అప్పగించనుంది . అలాగే ఆయన కుమారులను కూడా గోవిందరాజస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి బదిలీ చేస్తున్నారు. 
 
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడి హోదా నుంచి గత పాలకమండలి రమణ దీక్షితులును తొలగించింది. గత ఏడాది  మే నెలలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడి హోదాలో టీటీడీపై విమర్శలు చెయ్యడంతో అర్చకులు రిటైర్మెంట్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. రమణ దీక్షితులుతో శ్రీవారి ఆలయంలో ఉన్న మరో ముగ్గురు ప్రధాన అర్చకులును తొలగించింది. ఈ నిబంధనను టీటీడీ ఆలయాలకు వర్తింప చెయ్యడంతో తిరుచానురు ఆలయంలో ఉన్న అర్చకులు కూడా బైటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో రిటైర్మెంట్ అంశంపై కోర్టును ఆశ్రయించారు.  


ఇక...తనకు జరిగిన అన్యాయంపై అదే సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ దృష్టికి రమణ దీక్షితులు తీసుకువెళ్లారు. దీంతో...తాము అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జగన్. మరోవైపు...దేవాదాయశాఖకు సంబంధించిన జిఓ నెంబర్ 34ని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు....అర్చకులకు వంశపార్యపర అర్చకత్వాన్ని పునఃరుద్దరించేలా ఉత్తర్వులు ఇచ్చింది రాష్ర్ట ప్రభుత్వం. దీంతో టీటీడీలో కూడా రమణ దీక్షితులుతో పాటు రిటైర్ అయిన మీరాశి వంశీకులును తిరిగి నియమించాలని టిటిడిని ఆదేశించారు సీఎం జగన్. ఈ అంశాన్ని చర్చించిన పాలకమండలి.....రమణ దీక్షితులును తిరిగి నియమించే బాధ్యతలను ఈఓ సింఘాల్ నేతృత్వంలో కమిటికి అప్పగించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: