ఐటీ కంపెనీలపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడుతోంది. కొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ జాబితాలో చిన్న కంపెనీల నుండి ప్రముఖ కంపెనీల వరకు ఉండటం గమనార్హం. కొన్ని రోజుల క్రితం కాగ్నిజెంట్ కంపెనీ 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇన్ఫోసిస్ కంపెనీ కూడా సీనియర్ స్థాయి సిబ్బందికి వేల మంది ఉద్యోగులను తొలగించటం గురించి సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది. 
 
దాదాపు 12,000 మంది సిబ్బందిని తొలగించాలనే ఆలోచనలో ఇన్ఫోసిస్ కంపెనీ ఉందని రిపోర్టులు రావడం గమనార్హం. జూనియర్, మిడిల్ లెవెల్ అసోసియేట్లలో దాదాపు 5,000 నుండి 10,000 మంది ఉద్యోగులను సాగనంపాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2,200 మంది సీనియర్ మేనేజర్లను సాగనంపనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఆర్ నిపుణులు ఆటోమేషన్ రాకతో ఖర్చులు తగ్గించుకోవటానికి కంపెనీలు సిబ్బందిని తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. 
 
ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రింటర్లు, పర్సనల్ కంప్యూటర్లను తయారూచేసే హెచ్‌పి కంపెనీపై కూడా పడిందని తెలుస్తోంది. 2022 సంవత్సరం నాటికి హెచ్‌పి కంపెనీ 7000 నుండి 9000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశంలో హెచ్‌పి కంపెనీ దాదాపు 500 మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐటీ రంగ నిపుణులు మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 
 
ఐటీ కంపెనీలపై అంతర్జాతీయంగా, జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం పడుతోందని అందువలనే కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయని తెలుస్తోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఉండటం ప్రస్తుతం ఐటీ రంగంలో పని చేసేవారిని కలతకు గురి చేస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఐటీ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగాల భద్రత గురించి అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయని సమాచారం. 




మరింత సమాచారం తెలుసుకోండి: