ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. సుప్ర‌సిద్ధ నేత‌కు కీల‌క‌ పదవి అప్పగించారు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగత ఎన్టీఆర్ స‌తీమ‌ణి నంద‌మూరి లక్ష్మీపార్వతిని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఈ మేర‌కు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నందమూరి లక్ష్మీపార్వతి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. నందమూరి తారకరామారావు భార్య అయిన ఆమె చంద్రబాబు మీద విమర్శల దాడి చేసేవారు. తాజా నిర్ణ‌యం తెలుగుదేశం అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. 


టీడీపీ అధినేత స‌తీమ‌ణి పార్టీ చీలిక ప‌ర్వం అనంత‌రం నందమూరి లక్ష్మీపార్వతి సొంత పార్టీ పెట్టారు. అయితే, ఆ త‌దుప‌రి క్రియాశీల రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. నిన్న‌టికి నిన్న చంద్ర‌బాబుపై ల‌క్ష్మీపార్వ‌తి విమ‌ర్శ‌లు గుప్పించారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో కేసు నడుస్తోందని ల‌క్ష్మీపార్వ‌తి వ్యాఖ్యానించారు. ``పోలవరం పై మేం రివర్స్ టెండరింగ్ కు వెళ్తే 800 కోట్లు ఆదా అయింది. అంటే ఒక అంశంలో ఇంత మిగిలితే...మిగిలిన అంశాలలో వీరి దోపిడీ ఎంత ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇన్ని దోపిడీలు చేసి వీరు ఇలా ఎలా తిరుగుతారు.వీరిపై చర్యలు ఉండవా.? మొదటి నుంచి చంద్రబాబు అవినీతిపరుడే.చంద్రబాబు అవినీతిపై అప్పటి విపక్షాలు పోరాడాయి.`` అని ఆమె గుర్తు చేశారు. అవినీతిలో భాగంగా చంద్రబాబు,లోకేష్‌లు రహస్యంగా వందల జిఓలు విడుదల చేశారని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు. ``తండ్రి కొడుకులు ఇద్దరూ రహస్య విదేశీ ప్రయాణాలు చేసి ఇక్కడ సంపాదించిన డబ్బుంతా తీసుకువెళ్లారు. దాచిపెట్టారు. ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు అవినీతిపై క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. నేను  కేసు కూడా వేశాను. సుప్రీంకోర్టు తీర్పు వల్ల తిరిగి విచార‌ణ జరుగుతోంది. చంద్రబాబు అవినీతిపై రాష్ర్టపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌కు లేఖలు రాయాలని నిర్ణయించుకున్నాను.`` అని వెల్ల‌డించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: