ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం తక్షణం చీఫ్‌ సెక్రటరీ పోస్టు నుంచి వైదొలగి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించాలంటూ సాధారణ  పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాధాన్యం లేని హెచ్‌ఆర్‌డీ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించడం అధికార, రాజకీయ వర్గాల్లో పెను సంచలనమైంది.


తాజా సమాచారం ప్రకారం ఏపీ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా బాధ్యతలు చేపట్టకుండానే ఆయన సెలవు పెట్టనున్నారు. డిసెంబర్‌ 6 వరకు సెలవు పెట్టినట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీలు ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ తీరుపై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఆయన నెలరోజుల పాటు సెలవుపై వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇప్పటికే సీఎస్ ఆకస్మిక బదిలీ పై ప్రతిపక్షాలు వైఎస్ జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.


ఇక ఆంధ్రప్రదేశ్‌ తదుపరి సీఎస్‌గా నీలం సాహ్ని పేరు వినిపిస్తోంది.  సీఎస్‌గా నీలం సాహ్ని సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడతాయని సమాచారం. ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్ని ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సాంఘిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు సీఎంఓ లో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ సంతకం అయిన వెంటనే ఉతర్వులు వెలువడే అవకాశం వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: